వారి క్వారంటైన్ చెట్లపైనే.. ఆదర్శంగా నిలుస్తున్న యువ కూలీలు!

29-03-2020 Sun 07:33
  • చెన్నై నుంచి తిరిగొచ్చిన కూలీలు
  • కరోనా సోకకున్నా 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్
  • చెట్లనే నివాసంగా మార్చుకుని ఆదర్శంగా నిలిచిన వైనం
youth quarantined themselves for 14 days on a tree

తమ వల్ల తమ వారికి ఏమీ కాకూడదన్న యువకుల ఆలోచన అందరితోనూ ప్రశంసలు అందుకునేలా చేస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో చెన్నై నుంచి గ్రామానికి చేరుకున్న ఏడుగురు కూలీలు.. గ్రామంలోకి వెళ్లకుండా చెట్లనే నివాసాలుగా మార్చుకున్నారు. 14 రోజులపాటు చెట్లపైనే నివసించాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌‌లోని బాలరామ్‌పూర్ ప్రాంతంలోని వింగిడి గ్రామంలో జరిగిందీ ఘటన.

గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు చెన్నై నుంచి స్వస్థలానికి చేరుకున్నారు. అయితే, గ్రామంలోకి వెళ్లి మరింత మందికి ప్రమాదకరంగా మారడం ఇష్టంలేని యువకులు.. గ్రామం బయట ఉన్న మామిడి, రావిచెట్లను తమ నివాసంగా మార్చుకున్నారు. గ్రామస్థుల సాయంతో మంచం, దోమతెర ఏర్పాటు చేసుకుని 14 రోజులపాటు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారు. వారి నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. గత సోమవారం నుంచే వారు అక్కడ నివసిస్తున్నారు.

యువకుల్లో ఒకడైన బిజయ్ సింగ్ మాట్లాడుతూ.. గత శనివారం తాము చెన్నై నుంచి రైలులో బయలుదేరామని, ఖరగ్‌పూర్‌లో వైద్యులు తమకు పరీక్షలు నిర్వహించారని పేర్కొన్నాడు. తమలో ఎవరికీ కరోనా సోకలేదని తేలినప్పటికీ 14 రోజులపాటు నిర్బంధంలో ఉండాలని సూచించారని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత గ్రామానికి చేరుకున్నప్పటికీ లోపలికి అడుగుపెట్టలేదని, మంచంపైనే బస ఏర్పాటు చేసుకుని ఉంటున్నట్టు వివరించాడు.