IMF: ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి అడుగు పెట్టింది.. భారీగా ఉద్యోగాలు పోతాయి.. దివాళాలు ఎక్కువవుతాయి: ఐఎంఎఫ్

  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కరోనా
  • అమెరికా సహా అన్ని దేశాల్లో మాంద్యం
  • కరోనాను కట్టడి చేయలేకపోతే తీవ్ర పర్యవసానాలు తప్పవు
We have entered recession confirms IMF

ఏదైతే జరగకూడదని అందరూ కోరుకున్నారో... అదే జరిగింది. కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అధికారికంగా ప్రకటించింది. కరోనా ప్రభావం యావత్ ప్రపంచంపై తీవ్ర స్థాయిలో ఉందని... దీని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రానున్న రోజుల్లో దీని ప్రభావం భారీగా ఉండబోతోందని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జీవా తెలిపారు.

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక వృద్ధిని తాము మరోసారి సమీక్షించామని ఆమె తెలిపారు. మనం ఆర్థిక సంక్షోభంలోకి అడుగుపెట్టేశామని... ఇది క్లియర్ అని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో 189 దేశాలకు చెందిన ఐఎంఎఫ్ ప్రతినిధులతో సమావేశానంతరం క్రిస్టాలినా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రతినిధులందరూ నేరుగా కాకుండా, వర్చువల్ మాధ్యమంగా భేటీ అయ్యారు.

ప్రపంచ దేశాలన్నీ కరోనాను కట్టడి చేయాలని... వ్యవస్థలో నిధుల కొరత లేకుండా చూసుకోవాలని... అప్పుడే  2021లో ఈ మాంద్యం నుంచి మనం బయటపడే అవకాశాలు ఉన్నాయని క్రిస్టాలినా తెలిపారు. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పాటు అమెరికా కూడా మాంద్యంలో ఉందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ఏడాది మాంద్యం ప్రభావం ఏ మేరకు ఉండబోతోందో అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. వైరస్ ను అదుపుచేయడం ఒక్కటే ప్రస్తుత పరిస్థితుల్లో దీని నుంచి బయటపడే మార్గమని చెప్పారు. లేని పక్షంలో తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

ఆర్థిక మాంద్యం కారణంగా దివాళాలు ఎక్కువ అవుతాయని, భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతారని క్రిస్టాలినా ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక సాయం కోసం 81 దేశాల నుంచి తమకు ఎమర్జెన్సీ రిక్వెస్ట్ లు ఉన్నాయని... వీటిలో 50 పేద దేశాలని  చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2.5 ట్రిలియన్ డాలర్లు అవసరం కావచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో, సంక్షోభం నుంచి బయట పడేందుకు అన్ని దేశాలు కరోనా కట్టడికి కృషి చేయాలని విన్నవించారు.

More Telugu News