Telangana: తెలంగాణలో ఒక్క రోజే 14 కరోనా కేసులు.. ప్రభుత్వం అప్రమత్తం

  • 14 మందిలో ఒకరు వైద్యుడి తల్లి.. మరొకరు 76 ఏళ్ల వృద్ధుడు
  • బులెటిన్ విడుదల చేయని ఆరోగ్య శాఖ
  • ప్రత్యేక ఆసుపత్రులుగా గచ్చిబౌలి క్రీడా గ్రామంలోని భవనాలు
14 corona positive cases in Telangana in one day

తెలంగాణలో నిన్న ఒక్క రోజే 14 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 59కి చేరుకుంది. బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

నిన్న నమోదైన కేసుల్లో అమెరికా నుంచి వచ్చిన 76 ఏళ్ల వృద్ధుడు ఒకరు కాగా, ఓ వైద్యుడి తల్లి కూడా ఉన్నారు. మిగతా 12 మంది వివరాలు తెలియాల్సి ఉంది. వీరందరూ వేర్వేరు దేశాల నుంచి వచ్చిన వారు, వారితో కలిసి గడిపిన వారే కావడం గమనార్హం. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు బులెటిన్ విడుదల చేస్తూ వస్తున్న ఆరోగ్య శాఖ నిన్న మాత్రం ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదు.

కరోనా వైరస్ కేసుల సంఖ్య  పెరుగుతుండడంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది. కరోనా వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ఎన్ 95 మాస్కులు, అవసరమైన దుస్తులు, వస్తువులను కొనుగోలు చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం వీటికి కొరత లేకపోయినా ముందు జాగ్రత్తగా వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అలాగే, వైరస్ సామాజిక వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గచ్చిబౌలి క్రీడా గ్రామంలోని బహుళ అంతస్తుల భవనాలను ప్రత్యేక ఆసుపత్రులుగా మార్చాలని నిర్ణయించింది.

More Telugu News