CM Ramesh: వలస కార్మికులకు అండగా నిలవాలన్న సీఎం రమేశ్... వెంటనే స్పందించిన కేటీఆర్

  • సంగారెడ్డిలో చిక్కుకుపోయిన బీహార్, ఝార్ఖండ్ కార్మికులు
  • సీఎం రమేశ్ దృష్టికి తెచ్చిన ఎంపీ నిషికాంత్ దూబే
  • సాయం చేయాలంటూ కేటీఆర్ ను కోరిన సీఎం రమేశ్
KTR responds quickly over CM Ramesh appeal

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడివాళ్లను అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే, వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోవడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. దీనిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అభ్యర్థన చేయగా, తెలంగాణ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. సంగారెడ్డి జిల్లాలో బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, లాక్ డౌన్ కారణంగా వారు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తనకు ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ నిషికాంత్ దూబే వివరించారని సీఎం రమేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

దాంతో తాను కార్మికులను పరామర్శించానని, వారి యాజమాన్యంతో మాట్లాడానని తెలిపారు. ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా తెలంగాణ సీఎంవోను, మంత్రి కేటీఆర్ ను కోరుతున్నానని, వలస కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ లో బదులిచ్చారు. 'కార్మికులకు తప్పకుండా అండగా నిలుస్తాం ఎంపీ గారూ' అంటూ ట్వీట్ చేశారు. తన కార్యాలయంతో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా దీనిపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

More Telugu News