KCR: ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి: సీఎం కేసీఆర్

  • తెలంగాణలో 59 కరోనా కేసులు
  • ఒకరికి నయమైందన్న సీఎం కేసీఆర్
  • స్వీయరక్షణే శ్రీరామరక్ష అంటూ హితవు
CM KCR press meet over corona influence

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా విజృంభణపై ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఒక వ్యక్తికి నయమైందని తెలిపారు. ప్రస్తుతానికి 58 కరోనా బాధితులున్నారని, ఇవాళ ఒక్కరోజే 10 కేసుల్లో కరోనా నిర్ధారణ అయిందని అన్నారు. మరో 20 వేల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో కానీ, గృహనిర్బంధంలో కానీ ఉన్నారని, వీరి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

కరోనా నిరోధక చర్యల్లో ప్రజల సహకారాన్ని సీఎం ప్రశంసించారు. ప్రజలు సహకరించకుంటే కరోనా విస్ఫోటనం చెందేదని, జరిగే నష్టాన్ని ఊహించలేమని అభిప్రాయపడ్డారు. అయితే, తాము లాక్ డౌన్ విధించినా, రాత్రివేళల్లో కర్ఫ్యూ పొడిగించినా ఇవాళ ఒక్కరోజే 10 కేసులు రావడం ఆందోళనకరమని, ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరింత క్రమశిక్షణ పాటించాలని అన్నారు. ఇది ఎంత భయంకరమైన వ్యాధో, అర్థం చేసుకుంటే అంత సింపుల్ వ్యాధి అని వ్యాఖ్యానించారు. దీనికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదని, ఉన్న మందు ఏదంటే దీని వ్యాప్తిని నిరోధించడమేనని అన్నారు.

కరోనాపై సరైన నివారణ చర్యలు తీసుకోని ఫలితంగా అన్ని వసతులు ఉన్న అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఆగమాగం అయిపోతోందని తెలిపారు. మనదేశంలో సామాజిక దూరం పాటించడమే కరోనా నివారణకు ఏకైక మార్గమని పేర్కొన్నారు. చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్ తరహాలో కరోనా భారతదేశంలో ప్రబలితే 20 కోట్లమందికి సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దాంట్లో మనం కూడా ఉండొచ్చని హెచ్చరించారు. దీనికి ప్రధానమంత్రులు, మంత్రులు, అధికారులు ఎవరూ అతీతులు కారని, ఈ విపత్తు సమయంలో స్వీయరక్షణే శ్రీరామరక్ష అని పిలుపునిచ్చారు.

అయితే, కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. ప్రధాని మోదీతో కూడా మాట్లాడానని, ఆయన కూడా అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారని వెల్లడించారు.

More Telugu News