Javed Miandad: నాటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వైరస్ బారిన పడిన పాక్ క్రికెటర్!

  • 1992లో వరల్డ్ కప్ గెలిచిన పాకిస్థాన్
  • ఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించిన జావెద్ మియాందాద్
  • తనకు గుర్తు తెలియని వైరస్ సోకిందని వెల్లడించిన మియాందాద్
  • శరీరమంతా చెమటలు పట్టి నీరసం వచ్చేసిందని వెల్లడి
Pakistan cricket legend Javed Miandad says he was effected by an unknown virus

పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో 1992 వరల్డ్ కప్ ఓ మధురజ్ఞాపకం. పాకిస్థాన్ మొదటిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. నాటి ఫైనల్లో పాక్ జట్టు ఇంగ్లాండ్ పై విజయం సాధించి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఆ మ్యాచ్ లో పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్ మొండిపట్టుదలతో ఆడి 58 పరుగులు సాధించాడు. అయితే ఇప్పటివరకు చాలా తక్కువమందికి తెలిసిన ఓ విషయాన్ని మియాందాద్ తాజాగా వెల్లడించాడు. ఆ మ్యాచ్ లో తాను వైరస్ బారినపడ్డానని, అది అంతుచిక్కని వైరస్ అని, దాని ప్రభావంతో శరీరం మొత్తం చెమటలు పట్టాయని మియాందాద్ గుర్తుచేసుకున్నాడు.

శరీరంలోని చాలావరకు శక్తి ఆ గుర్తుతెలియని వైరస్ కారణంగా హరించుకుపోయిందని, అయినప్పటికీ మొండిగా పోరాడానని తెలిపాడు. అసలు ఆ మ్యాచ్ ఎలా గెలిచామో, నేను ఎలా బ్యాటింగ్ చేశానో ఇప్పటికీ అర్థం కాదని అన్నాడు. "అప్పటికే  రెండు వికెట్లు పడ్డాయి. నేను, కెప్టెన్ ఇమ్రాన్ క్రీజులో ఉన్నాం. నాకేమైందో కూడా అర్థం కాని పరిస్థితి. నేను కేవలం క్రీజులో నిలుచున్నానంతే. ఇమ్రాన్ అండతో ఎలాగోలా గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగాం" అని వివరించాడు.

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఆ వరల్డ్ కప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 6 వికెట్లకు 249 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ జట్టు లక్ష్యఛేదనలో 227 పరుగులకే ఆలౌటైంది. తాజాగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో జావెద్ మియాందాద్ వైరస్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

  • Loading...

More Telugu News