Perni Nani: 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడి వస్తేనే తీసుకుంటాం: పేర్ని నాని స్పష్టీకరణ

  • ఈ రోజు పరిస్థితులు వేరు
  • చేతులెత్తి ప్రార్థిస్తున్నాం
  • ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండండి
perni nani on corona

విదేశాల నుంచి రాష్ట్రానికి 28 వేల మంది వచ్చారని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ రోజు ఆయన అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరోనా నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 52 వేల ఎన్‌-95 మాస్కులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో 200, నియోజక వర్గంలో 100 ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏపీలో 400 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

'ఇది చాలా బాధపడాల్సిన విషయమే. సాధారణంగా ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర విద్యార్థులు చిక్కుకుపోయారని తెలిస్తే ప్రత్యేకంగా హెలికాప్టర్లలో తీసుకొస్తాం. ఫారిన్‌లో చిక్కుకుపోయినా తీసుకొస్తాం. కానీ, ఈ రోజు పరిస్థితులు వేరు. మందులేని కరోనా విజృంభిస్తోంది' అని పేర్ని నాని చెప్పారు.

'ఏపీ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ అచేతన స్థితిని అర్థం చేసుకోవాలి. ప్రజల ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయలేని పరిస్థితి ఉంది. 14 రోజులు దాటితే కానీ కరోనా లక్షణాలు కనపడవు. చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండండి' అని కోరారు.

ఆయా రాష్ట్రాల సీఎంలతో జగన్ మాట్లాడారు..

'ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ముఖ్యమంత్రులతో ఏపీ సీఎం జగన్‌ మాట్లాడారు. ఏపీ ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు' అని పేర్ని నాని తెలిపారు. 'వందల సంఖ్యలో ఏపీ సరిహద్దులకి చేరుకుంటోన్న ఏపీ ప్రజలకు ఇదే చెబుతున్నాం.. 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడి వస్తేనే తీసుకుంటాం. రావద్దని మేము అనట్లేదు. ఈ అవకాశం మీకు ఉంది' అని తెలిపారు.

More Telugu News