kapil dev: ఇల్లు ఊడుస్తున్నా.. వంట చేస్తున్నా: కపిల్ దేవ్

I sweep the house and cook for everyone admits kapil dev
  • మీరంతా ఇళ్లలోనే ఉండి ప్రభుత్వానికి సహకరించండి
  • మనమంతా ఏకమైతే కరోనాపై యుద్ధంలో గెలుస్తాం
  • ప్రజలకు భారత క్రికెట్ దిగ్గజం సూచన
లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విజ్ఞప్తి చేశాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలందరికీ ఇదే జీవనరేఖ అని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు కపిల్ మద్దతు తెలిపాడు.

 తానెప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటానన్న కపిల్..ఈ విపత్కర పరిస్థితుల్లో  మనమంతా ఒక్కటైతే కరోనాపై యుద్ధంలో గెలుస్తామన్న ఆశాభావం ఉందన్నాడు. అది జరగాలంటే ప్రజలంతా ప్రభుత్వం చెప్పినట్టు వినాలన్నాడు. ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి, వైద్యులకు బలం చేకూర్చాలని కోరాడు.

‘ఇప్పుడు మీరంతా ఇళ్లలోనే ఉండాలి. దయచేసి ఆ పని చేయండి. ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతున్న వారికి, ఆయా సంస్థలకు సాయం చేసిన వారవుతారు. దీన్ని సానుకూల దృక్పథంతో కూడా స్వీకరించొచ్చు. దీన్ని లాక్‌డౌన్‌ అనే కాదు ఇంట్లో ఉండడం కూడా అనుకోవచ్చు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీకు మీరే సవాల్ విసురుకోండి. మీరేం ఒంటరిగా లేరు. మీ ఇంట్లో మీ ప్రపంచమే ఉంది. అదే మీ కుటుంబం. మిమ్మల్ని ఆహ్లాదపరిచేందుకు  పుస్తకాలు, టీవీ, మ్యూజిక్‌ ఉండనే ఉన్నాయి. అన్నిటి కంటే ఉత్తమమైన మార్గం ఏమిటంటే మీ కుటుంబ సభ్యులతో హాయిగా మాట్లాడొచ్చు’ అని కపిల్ చెప్పుకొచ్చాడు.

నేనూ ఇంట్లోనే ఉంటున్నా 

తాను కూడా ఇంట్లోనే  ఉన్నానని చెప్పిన కపిల్ రకరకాల పనులతో సేదతీరుతున్నానని చెప్పాడు. ‘మా ఇల్లు  ఊడుస్తున్నా. గార్డెన్ శుభ్రం చేశా. మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెనే ఇప్పుడు నా గోల్ఫ్ కోర్స్‌ అయింది. అలాగే, మా కుటుంబ సభ్యులతో గడిపేందుకు నాకిప్పుడు చాలా సమయం దొరికొంది. చాలా ఏళ్లుగా ఇలాంటి అవకాశాన్ని నేను కోల్పోయా. ఇంట్లో అందరికీ నేను వండి పెడుతున్నా. చాలా వంటకాలు చేస్తున్నా. ఇంగ్లండ్‌లో ఆడుతున్నప్పుడు నాతో పాటు ఉన్న రోమి (భార్య) వంట నేర్పించింది’ అని తెలిపాడు.

బాధ్యతను గుర్తు చేసింది 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరికీ పరిశుభ్రత మీద అవగాహన కలిగిందని కపిల్ అన్నాడు. వాళ్ల బాధ్యతను గుర్తు చేసిందని అభిప్రాయపడ్డాడు. శుభ్రత పాటించాలని, తరచూ చేతులు కడుక్కోవాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, మూత్ర విసర్జన చేయడం మానేయాలని తెలుసుకుంటారని చెప్పాడు. ఈ పాఠాలు ముందే నేర్వాల్సి ఉందన్నాడు. అయితే, ప్రస్తుత తరం ఇలాంటి పొరపాట్లు మున్ముందు చేయకూడదని భావిస్తున్నానని చెప్పాడు.
kapil dev
Lockdown
home
sweep the house
cook

More Telugu News