Telangana: తెలంగాణ నుంచి వెళ్తున్న రెండు కంటెయినర్లలో 300 మంది వలస కార్మికులు.. షాకైన పోలీసులు!

  • తెలంగాణ నుంచి రాజస్థాన్ కు వెళ్తున్న కంటెయినర్లు
  • మహారాష్ట్ర సరిహద్దులో సోదాలు
  • ట్రక్కుల్లో 300 మంది రాజస్థాన్ వాసులు
Maharashtra Cops Opened 2 Container Trucks Found Over 300 Migrant Workers

కరోనా నేపథ్యంలో యావత్ దేశం లాక్ డౌన్ కావడంతో... ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికుల వేదన వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడ బతకలేక, వారి సొంత ఊళ్లకు వెళ్లలేక తీవ్ర కష్టాలను అనుభవిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా... రిస్క్ తీసుకుని వారి ఊళ్లకు పయనమవుతున్నారు.

తాజాగా తెలంగాణ నుంచి రాజస్థాన్ కు వెళ్తున్న రెండు కంటెయినర్ ట్రక్కుల్లో ఏకంగా 300 మంది వలస కార్మికులు పట్టుబట్టారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఈ వలస కార్మికులు తమ రాష్ట్రానికి వెళ్లడానికి ఈ విధమైన ప్రమాదకరమైన విధానాన్ని ఎంచుకోవడంతో అధికారులు షాక్ అయ్యారు.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్న సమయంలో ట్రక్కు డ్రైవర్లు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారికి అనుమానం వచ్చింది. వాహనాలను తెరిచి చూడగా కార్మికులు కనిపించారు. వారిని ప్రశ్నించగా...  సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ఎలాంటి ట్రాన్స్ పోర్ట్ లేకపోవడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ట్రక్కు డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, నిస్సహాయ స్థితిలో ఉన్న కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అర్థం కావడంలేదని చెప్పారు. వీరికి సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

More Telugu News