RBI: రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ

  • 4.4 శాతానికి తగ్గిన రెపో రేటు
  • రివర్స్ రెపోలో 90 బేసిస్ పాయింట్ల కోత
  • వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
RBI Cuts Repo Rate by 75 Basis Points

కరోనా విస్తరణతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుం బిగించింది. గడచిన నాలుగు రోజులుగా పరపతి సమీక్షను జరిపిన ఆర్బీఐ, రెపో రేటును ముప్పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొద్దిసేపటి క్రితం స్వయంగా ప్రకటించారు. ఇదే సమయంలో రివర్స్ రెపో రేటును ఏకంగా 90 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.

ఇటీవలి కాలంలో ఇంత అధిక మొత్తంలో వడ్డీ రేటు కోతను ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ తగ్గింపు తరువాత రెపో రేటు 4.4 శాతానికి చేరుతుంది. బ్యాంకులకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతుందన్న ఉద్దేశంతోనే రెపో, రివర్స్ రెపోల మధ్య వ్యత్యాసాన్ని పెంచామని ఈ సందర్భంగా శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపైనా కన్నేసి ఉంచామని తెలిపారు.

ప్రస్తుతం మనం అసాధారణ పరిస్థితుల్లో ఉన్నామని వ్యాఖ్యానించిన దాస్, పరపతి కమిటీలో అత్యధికులు ఈ తగ్గింపును సమర్ధించారని ఆయన తెలిపారు. కాగా, కరోనాను ఎదుర్కొనేందుకు నిన్న కేంద్ర ప్రభుత్వం రూ. 1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News