Corona Virus: ఇంతకీ.. దోమలగూడ డాక్టర్ దంపతులకి కరోనా ఎలా సోకింది?

  • కరోనా బాధితులకు చికిత్స చేయని డాక్టర్లు
  • విదేశాలకు వెళ్లిన నేపథ్యం కూడా లేదంటున్న అధికారులు
  • వారిని కలిసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు
Many Questions over Domalguda Doctor Couple who tested positive Corona

హైదరాబాద్ దోమలగూడకు చెందిన వారిద్దరూ వైద్యులైన దంపతులు. ఇద్దరూ సోమాజిగూడలోని ఓ పేరుపొందిన ఆసుపత్రిలో పని చేస్తున్నారు. ఇద్దరికీ ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. వీరిద్దరినీ కలిసిన వారందరి గురించీ ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారందరినీ క్వారంటైన్ చేస్తున్నారు.

వాస్తవానికి వీరిద్దరూ కరోనా బాధితులకు చికిత్సను అందిస్తున్న గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్స్ కు వెళ్లలేదు. విదేశాలకు కూడా వెళ్లి రాలేదు. కానీ ఇద్దరికీ సోకింది. ఎలా వ్యాధి వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఒకరి నుంచి ఒకరికి సోకిందన్నది మాత్రం వాస్తవం.

ఇక వీరు పనిచేస్తున్న ఆసుపత్రిలో ఎంత మందితో కలిసి పని చేశారు? ఎందరు రోగులకు చికిత్స అందించారు? వారిలో డిశ్చార్జ్ అయిన వారు ఎక్కడ ఉన్నారు? వారి ఇంటి కుటుంబీకుల్లో, బంధుమిత్రుల్లో ఎంత మందికి వీరు క్లోజ్ గా ఉన్నారు? తదితర ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖకు ఇంకా సమాధానాలు లభించలేదు.

నిన్న మొన్నటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారు మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలుతుండగా, ఇప్పుడు కాంటాక్ట్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం, అధికారుల్లో ఆందోళన పెంచుతోంది. ఏదో ఒక అవసరం పేరిట వీధుల్లోకి విచ్చలవిడిగా వస్తున్న వారే ఇందుకు కారణమని, లాక్ డౌన్ ను మరింత కఠినం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.

More Telugu News