Nirmala Sitharaman: స్వయం సహాయక బృందాలకు భారీగా రుణపరిమితి పెంపు: నిర్మలా సీతారామన్

  • రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్టు నిర్మల వెల్లడి
  • పీఎం కిసాన్ యోజన కింద రైతులకు రూ.2 వేలు
  • ఈపీఎఫ్ చందా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరణ
FM Nirmala Sitharaman tells loan amount hike for self help groups

కరోనాను దేశం నుంచి తరిమేసేందుకు శక్తివంచన లేకుండా పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఊరట కలిగించేలా మరికొన్ని నిర్ణయాలు ప్రకటించింది. స్వయం సహాయక బృందాలకు ఇప్పుడున్న రూ.10 లక్షల రుణపరిమితిని రూ.20 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎలాంటి పూచీకత్తులు అవసరంలేని రుణాలు అందజేస్తామని చెప్పారు. తద్వారా 63 లక్షల గ్రూపులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.

అటు, పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ మాసంలో రూ.2 వేలు జమచేస్తామని చెప్పారు. ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కి పెంచుతున్నట్టు వెల్లడించారు. జన్ ధన్ యోజన ఖాతాల్లో 3 నెలల పాటు నెలకు రూ.500 చొప్పున జమ చేస్తామని కూడా పేర్కొన్నారు. ఉజ్వల పథకం కింద లబ్దిదారులకు 3 నెలల్లో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు.

అంతేకాకుండా, ఉద్యోగులకు ఊరట కలిగించే పలు నిర్ణయాలను కూడా నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. రానున్న 3 నెలలకు ప్రభుత్వమే ఈపీఎఫ్ చందా మొత్తాన్ని చెల్లిస్తుందని వెల్లడించారు. ఉద్యోగి వాటా 12 శాతం, యాజమాన్య వాటా 12 శాతం కలిపి ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లోకి ప్రభుత్వమే జమ చేస్తుందని వివరించారు. వందమంది లోపు ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుందని తెలిపారు.

అయితే, వందమంది ఉద్యోగుల్లో 90 శాతం మంది రూ.15 వేలు లోపు జీతం కలిగివుండాలని అన్నారు. ఉద్యోగులు 75 శాతం వరకు పీఎఫ్ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన పనిలేకుండా ఉపసంహరించుకోవచ్చని ఆర్థికమంత్రి చెప్పారు. 3 నెలల జీతం లేదా 75 శాతం పీఎఫ్ లో ఏది తక్కువైతే దాన్ని ఉపసంహరించుకోవచ్చని వివరించారు. ఆ మేరకు పీఎఫ్ నిబంధనలను సవరిస్తామని చెప్పారు.

More Telugu News