Gujarath: బతుకు పోరులో బాటసారులు... పనిలేక నడిచి సొంతూర్లకు చేరుతున్న వలస కూలీలు

  • గుజరాత్‌ నుంచి రాజస్థాన్‌కు పాదయాత్ర
  • అంతకంటే మరో మార్గం లేదని వెల్లడి
  • ఇక్కడ ఉంటే ఆకలి చావులేనని ఆవేదన
construction labour ride to their home by walk

రెక్కాడితేగాని డొక్కాడని శ్రమజీవులు వారంతా. పొట్ట చేత పట్టుకుని రాష్ట్రం దాటి పొరుగు రాష్ట్రానికి పని వెతుక్కుంటూ వచ్చినవారు. అంతా సవ్యంగా ఉన్న రోజుల్లో ఎంతోకొంత సంపాదించుకుని జీవనోపాధి పొందారు. ప్రస్తుతం దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఉన్నచోట పనిలేదు. సొంతూరుకు వెళ్లిపోదామంటే ప్రయాణ సౌకర్యం లేదు. దీంతో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూర్లకు నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇది గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో పనిచేస్తున్న వలసకూలీల దుస్థితి.

రాజస్థాన్‌ కూలీలు  పలువురు అహ్మాదాబాద్‌ నగరంలో నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. పనిచేసే చోటే గుడిసెలు వేసుకుని కాంట్రాక్టర్‌ ఇచ్చే డబ్బులతో జీవనోపాధి పొందేవారు. ప్రస్తుతం పనిలేకపోతే డబ్బు ఇచ్చేది లేదని కాంట్రాక్టర్‌ తేల్చిచెప్పాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లాపాపలతో నడిచి సొంతూర్లకు వెళ్లిపోతున్నారు. సైకిళ్లు ఉన్న వారు వాటిపై బయలుదేరుతున్నారు. వీరి దుస్థితిని చూసి స్థానిక పోలీసులు దారి మధ్యలో ఆహారం, మంచినీరు అందించి కాస్త ఆదుకుంటున్నారు.

'నేను నా సోదరుడితో కలిసి అహ్మదాబాద్‌లోని నిర్మాణ స్థలంలో పని చేస్తున్నాను. మా కుటుంబం కలిసి ఉంటోంది. పని లేకపోతే డబ్బు ఇచ్చేది లేదని కాంట్రాక్టర్ చెప్పడంతో మా సొంతూరికి వెళ్లిపోవడం తప్ప మాకు మరో మార్గం లేదు' అని రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌కు చెందిన గోవింద్ వాపోయాడు.

'పని దొరికితే నెలకు 9 నుంచి10 వేల రూపాయలు సంపాదిస్తాం. కుటుంబం గడిచిపోతుంది. పనిలేకుండా ఇక్కడే ఉంటే అంతే డబ్బు ఖర్చవుతుంది. అ మొత్తం ఎవరిస్తారు. అందుకే మా ఊరు వెళ్లిపోతున్నాం' అని మారివాడ గ్రామానికి చెందిన హితేష్ నాథ్ చెప్పాడు.

More Telugu News