New Delhi: మరి, ఎవరి ద్వారా సోకిందో... ఓ డాక్టర్ కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్!

  • ఈశాన్య ఢిల్లీలోని మౌజ్ పూర్ లో ఘటన
  • ఆయన వద్దకు వెళ్లిన వారందరూ క్వారంటైన్ లోకి
  • ఢిల్లీలో 37కు చేరిన కరోనా కేసులు
Doctor Family Positive for Corona

ఈశాన్య ఢిల్లీలోని ఓ మోహల్లా క్లినిక్ లో పనిచేస్తున్న డాక్టర్ కుటుంబమంతా కరోనా వ్యాధి బారిన పడటంతో మౌజ్ పూర్ లో తీవ్ర కలకలం రేగింది. వైద్యునితో పాటు అతని భార్య, కుమార్తెకు కూడా కరోనా సోకిందని, వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని వైద్యాధికారులు తెలిపారు. ఈ నెల 12 నుంచి 18 మధ్య కాలంలో డాక్టర్‌ ను కలిసేందుకు సదరు క్లినిక్‌ కు వెళ్లిన వారిని క్వారంటైన్‌ లో ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే తెలియజేయాలని అధికారులు సూచించారు.

కాగా, ఈ వైద్యుడు ఇటీవల ఏదైనా విదేశాలను సందర్శించి వచ్చారా? లేక ఎవరైనా విదేశీ ప్రయాణికుడు వచ్చి వ్యాధిని అంటించాడా? అన్న విషయమై స్పష్టత లేదు. ప్రాథమిక స్థాయిలో ప్రజలకు వైద్య సేవలను దగ్గర చేసే నిమిత్తం ఢిల్లీ సర్కారు ఈ మొహల్లా క్లినిక్ పేరిట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

గత నెలలో ఢిల్లీలో జరిగిన హింసాకాండలో మౌజ్ పూర్ తీవ్రంగా నష్టపోయింది. ఆ ప్రాంతంలోని వైద్యుని కుటుంబానికే ఇప్పుడు కరోనా సోకింది. కాగా, బుధవారం కొత్తగా 5 కరోనా కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. రాష్ట్ర పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 37కు చేరిందన్నారు.

More Telugu News