Krishna District: క్వారంటైన్ కేంద్రం వద్దంటూ స్కూలుకు తాళం వేసిన కైకలూరు వాసులు

  • పెడన మండలంలోనూ ఇటువంటి ఘటన
  • క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాలు వద్దంటూ గ్రామస్థుల ఆందోళన
  • నందమూరులో ఐసోలేషన్ కేంద్రాన్ని మారుస్తామన్న అధికారులు
Locals protest against Quarantine center in Andhrapradesh

తమ గ్రామంలో క్వారంటైన్ కేంద్రం వద్దంటూ కృష్ణా జిల్లా ఆటపాక గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామ సమీపంలోని చైతన్య స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని వెంటనే అక్కడి నుంచి తరలించాలంటూ గ్రామస్థులు నిన్న ఆందోళనకు దిగారు. ఈ స్కూలును క్వారంటైన్ కేంద్రంగా మార్చి 100 పడకలతో తాత్కాలిక కేంద్రంగా ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం.రవికుమార్ ఉన్నతాధికారులకు సూచించారు.

విషయం తెలిసిన గ్రామస్థులు తమ గ్రామంలో క్వారంటైన్ కేంద్రం వద్దంటూ ఆందోళనకు దిగారు. స్కూలు చుట్టూ ఇళ్లు ఉన్నాయని, ఇక్కడ క్వారంటైన్ కేంద్రం వద్దని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. స్కూలుకు తాళాలు వేశారు. సమాచారం అందుకున్న ఎస్సై షణ్ముఖ సాయి స్కూలు వద్దకు చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. ఇక్కడ అనుమానిత కేసులు మాత్రమే ఉంటాయని, వైద్యాధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని చెప్పి వారికి నచ్చజెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.

పెడన మండలంలోని నందమూరులోనూ ఇటువంటి ఘటనే జరిగింది.  వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో అధికారులు ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మూకుమ్మడిగా కళాశాల వద్దకు వెళ్లి బీభత్సం సృష్టించారు. దీంతో స్పందించిన అధికారులు ఐసోలేషన్ కేంద్రాన్ని అక్కడి నుంచి తరలిస్తున్నట్టు చెప్పారు.  

More Telugu News