Indonesians: ముప్పు తెచ్చిపెట్టిన ఇండోనేషియా వాసులు... కరోనా ఉన్నా తెలంగాణకు ప్రయాణం!

  • నాలుగైదు పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకుని విమానం దిగిన విదేశీయులు
  • స్క్రీనింగ్ లో దొరకకుండా తప్పించుకున్న వైనం
  • వీరిని కలిసిన సుమారు 500 మంది
  • మూడు రోజుల్లో ముగియనున్న రెండు వారాల క్వారంటైన్
Indonesians Using Paracetamol Tablest

దాదాపు 17 రోజుల క్రితం ఇండోనేషియా నుంచి రామగుండం, కరీంనగర్ ప్రాంతానికి వచ్చిన ఇండోనేషియా వాసులందరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశానికే పెను ప్రమాదాన్ని ఇండోనేషియా నుంచే మోసుకుని వచ్చారని విచారణలో తేలింది. మొత్తం 10 మంది 9వ తేదీన న్యూఢిల్లీకి రాగా, అప్పటికే కొందరికి కరోనా సోకింది. స్క్రీనింగ్ లో బయటపడకుండా ఉండేందుకు ఒక్కొక్కరూ నాలుగైదు పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకున్నారని పోలీసులు తేల్చారు.

ఢిల్లీ వీధుల్లో యథేచ్ఛగా తిరిగిన వీరు, 13న సంపర్క్ క్రాంతిఎక్స్ ప్రెస్ ఎక్కి రామగుండం వచ్చారు. అక్కడి నుంచి కరీంనగర్ చేరుకున్న తరువాత ఒకరిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆపై అందరికీ వ్యాధి సోకినట్టు తేలింది. వీరిని కలిసిన తెలంగాణలోని 500 మంది ఇంకా హోమ్ క్వారంటైన్ లో ఉండగా, మరికొందరు ఆసుపత్రుల్లో ఉన్నారు.

వీరు ప్రయాణించిన రైలు బోగీలో 82 మంది ఉండగా, వారిలో పలువురు గద్వాల, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాల్లో దిగగా, వారందరినీ గుర్తించి, వారు కలిసిన వారిని కూడా క్వారంటైన్ లో ఉంచారు. వీరందరిలో 130 మంది అస్వస్థతతో ఉండటంతో, వారికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స చేయిస్తున్నారు. వీరందరి క్వారంటైన్ మరో మూడు రోజుల్లో (28వ తేదీ) ముగియనుండగా, ఆపై రక్త పరీక్షలు చేసి వారిని విడిచిపెట్టనున్నారు.

ఇక నిజాన్ని దాచి ఇండియాకు రావడంతో పాటు వందలాది మందిని కలిసిన ఇండొనేషియా వాసుల చర్యపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా సీరియస్ గా ఉన్నాయి. వీరితో పాటు ఉన్న సహాయకుడికి కూడా కరోనా సోకింది. వీరి చర్యతోనే కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగాయని ఉన్నతాధికారులు అంటున్నారు.

More Telugu News