Priyanka Chopra: కరోనాపై ఊహాగానాలకు ప్రియాంక చోప్రా చెక్.. ఆమె ప్రశ్నలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాధానాలివే!

  • మధుమేహం, హృద్రోగ సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి
  • గాలి ద్వారా ఈ వైరస్ సోకదు
  • ఒకసారి కోలుకున్న వారికి మళ్లీ వచ్చే అవకాశంపై స్పష్టత లేదన్న నిపుణులు
Priyanka Chopra hosts Instagram Live chat with WHO experts

కరోనా వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న అర్థంపర్థం లేని అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రముఖ నటి, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా ప్రయత్నించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘హు’ చీఫ్ టెడ్రోస్ అధనోమ్‌, టెక్నికల్ లీడ్ ఫర్ కోవిడ్-19 డాక్టర్ మరియా వన్ కెర్ఖోవ్‌లతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. కాగా, ప్రియాంక, ఆమె భర్త నిక్ జోనస్ ఇద్దరూ ప్రస్తుతం స్వీయ  నిర్బంధంలో ఉన్నారు.

ప్రియాంక ఆస్తమాతోనూ, ఆమె భర్త టైప్ 1 మధుమేహంతోనూ బాధపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని..  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, మధుమేహం, హృద్రోగ, శ్వాస సంబంధ సమస్యలున్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ అడిగిన ప్రియాంక ప్రశ్నకు.. ‘హు’ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇలాంటి సమస్యలున్న వారు వైరస్ ప్రభావానికి లోనుకాకుండా ఉండాలని, ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

వైరస్ ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా? అన్న మరో ప్రశ్నకు అలా జరగదని తెలిపారు. వైరస్ ఉన్న రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే వైరస్ సంక్రమించే అవకాశం ఉందన్నారు. అందుకనే తుమ్మేటప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోవాలని సూచించారు. ఒకసారి ఈ వైరస్ బారినపడి కోలుకున్న వారికి మళ్లీ ఇది వచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు మాత్రం కచ్చితంగా చెప్పలేమని సమాధానం ఇచ్చారు. అయితే,  ఇప్పటి వరకు లక్షమందికిపైగా ఈ వైరస్ నుంచి కోలుకున్నట్టు వివరించారు.

More Telugu News