Nirmala Sitharaman: ఆధార్, పాన్ అనుసంధానం గడువు జూన్ 30 వరకు పొడిగింపు: నిర్మలా సీతారామన్

  • కరోనా వ్యాప్తి నిరోధానికే లాక్ డౌన్ అని నిర్మల వెల్లడి
  • ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు కొలిక్కి వచ్చిందన్న ఆర్థికమంత్రి
  • పన్ను చెల్లింపుల ఆలస్య రుసుం తగ్గిస్తున్నట్టు ప్రకటన
Nirmala Sitharaman announces key decisions

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికే లాక్ డౌన్ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని, ఆధార్-పాన్ అనుసంధానం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నామని ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం చివరిరోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉందని అన్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్ ల దాఖలుకు 2020 జూన్ 30 గడువు అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుం 12 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు.

అంతేకాకుండా, టీడీఎస్ జమలో ఆలస్య రుసుం 18 నుంచి 9 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వివాద్ పే విశ్వాస్ పథకం గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నామని, పన్ను వివాదం మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగిస్తున్నట్టు చెప్పారు. మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్టీ రిటర్న్ ల దాఖలు గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ఆర్థికమంత్రి వివరించారు. కాంపోజిషన్ స్కీమ్ రిటర్న్ ల దాఖలుకు కూడా జూన్ 30 వరకు గడువు పెంచామని తెలిపారు.

More Telugu News