Corona Virus: కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌

serum institute is developing vaccine for corona virus
  • ప్రీ క్లినికల్ ట్రయల్స్‌ మొదలు పెట్టాం
  • నాలుగైదు వారాల్లో మనుషులపై ప్రయోగం
  • ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో వ్యాక్సిన్‌కు తుదిరూపం
  • సంస్థ సీఈఓ అదార్ పూనావాలా వెల్లడి
కరోనా వైరస్‌ వ్యాధికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌ ను ప్రారంభించినట్లు ఆ సంస్థ సీఈఓ అదార్ పూనావాలా ప్రకటించారు. ఐదు దశాబ్దాలుగా వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమై ఉన్న సీరమ్ సంస్థకు మంచి పేరుంది. ఇప్పుడు కరోనా వైరస్‌ వ్యాధిని అదుపు చేసే వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టామని అదార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయంలో అమెరికాకు చెందిన కోడాజెనిక్స్‌ అనే సంస్థతో కలిసి పని చేస్తున్నామన్నారు.

వ్యాక్సిన్‌ మూలకణాన్ని ఇప్పటికే గుర్తించి క్లినికల్ పరీక్షలు చేపట్టామని తెలిపారు. కరోనా వైరస్‌ను పోలి ఉండే సింథటిక్‌ వైరస్‌ను రూపొందించడం వ్యాక్సిన్‌ తయారీలో అతి పెద్ద విజయం అన్నారు.  ప్రస్తుతం ఇది జంతువులపై ప్రయోగించే ‘ప్రీ క్లినికల్’ దశలో ఉందన్నారు. నాలుగైదు వారాల్లో మనుషులపై ప్రయోగాలు మొదలు పెట్టే అవకాశం ఉందని భారత వ్యాక్సిన్ తయారీదార్ల సంఘం అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న పూనావాలా చెప్పారు.

క్లినికల్ ట్రయల్స్‌ను పలు దేశాలతో పాటు చైనాలో కూడా నిర్వహించే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు. ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో వ్యాక్సిన్‌కు తుది రూపం ఇచ్చే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని అదార్ తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీకి తాము రూ. 300 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేశామన్నారు. ప్రస్తుతానికైతే ముందు జాగ్రత్తతోనే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వాలు కలిసి అప్రమత్తంగా వ్యవహరిస్తే ఈ ముప్పును తప్పించుకోవచ్చని సూచించారు.
Corona Virus
vaccine
serum institute
pre trials

More Telugu News