IMF: మహమ్మారి కారణంగా 2009ని మించిన ఆర్థికమాంద్యం!: ఐఎంఎఫ్ చీఫ్

  • అల్పాదాయ దేశాలను ఆదుకోవాలి
  • లేకుంటే కరోనా పూర్తిగా నశించినట్టు ఎన్నటికీ భావించలేము
  • ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా
IMF says will fund Poor Countries

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం 2009లో ఏర్పడిన ఆర్థిక మాంద్యానికి మించిన పతనంలోకి వెళ్లనుందని, తమ వద్ద ఉన్న ట్రిలియన్ డాలర్ల నిధులనూ (సుమారు రూ. 77 లక్షల కోట్లు) వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) ప్రకటించింది. అభివృద్ధి చెందిన దేశాలు, తక్కువ ఆదాయం ఉన్న దేశాలను ఆదుకోవాలని, ఈ దేశాలను ఆదుకోకుంటే, కరోనాను తరిమేసినట్లుగా ఎన్నటికీ భావించలేమని హెచ్చరించింది.

వైరస్ కారణంగా ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు ఎంతో నష్టం వాటిల్లిందని వ్యాఖ్యానించిన ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా, చిన్న దేశాల్లో మూలధన కొరత రానివ్వకుండా చూడాలని కోరారు. ఇప్పటికే ఎన్నో దేశాల్లో షట్ డౌన్ అమలులోకి వచ్చిందని గుర్తు చేసిన ఆమె, గ్రూప్-20 ఆర్థిక మంత్రులు సమావేశమై, నష్ట నివారణా చర్యలు చేపట్టాలని సూచించారు.

2008లో ఏర్పడిన ఆర్థిక సమస్యల కారణంగా 2009లో ప్రపంచ ఎకానమీ 0.6 శాతం మేరకు తగ్గిందని, అదే సమయంలో ఇండియా, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు శరవేగంగా వృద్ధి రేటును సాధించాయని క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు. కరోనా విజృంభించిన ఈ పరిస్థితుల్లో ప్రపంచ జీడీపీ 1.5 శాతం మేరకు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమె అంచనా వేశారు.

ఇప్పటికే ప్రాణనష్టం అధికంగా జరిగిందని, అన్ని దేశాలూ కలిసి పనిచేసి, ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే ఆర్థిక వ్యవస్థకు తక్కువ నష్టం వాటిల్లుతుందని ఆమె సలహా ఇచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు 83 బిలియన్ డాలర్లను వెనక్కు తీసుకున్నారని వెల్లడించిన ఆమె, పరిస్థితి సద్దుమణిగే వరకూ ఈ పెట్టుబడులు తిరిగి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు లేవని అన్నారు.

ఇప్పటికే ఐఎంఎఫ్ కు 80 సభ్య దేశాల నుంచి అత్యవసర నిధి కింద డబ్బు కావాలన్న విజ్ఞప్తులు అందాయని చెప్పిన జార్జివా, తమ తరఫున తాము తీసుకోవాల్సిన చర్యలపై సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More Telugu News