Sensex: ఇండియా లాక్ డౌన్ తో కుప్పకూలిన మార్కెట్లు... సెన్సెక్స్ 3,935 పాయింట్ల పతనం!

  • లాక్ డౌన్ తో దెబ్బతిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత లోయర్ సర్క్యూట్ ను తాకిన మార్కెట్లు
  • కుప్పకూలిన బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు
Sensex Sheds Over 3950 Points Amid Board Selloff As Coronavirus Haunts Markets

కరోనా వైరస్ ప్రభావంతో ఇండియా మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో, దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. కరోనా ఎఫెక్ట్ ఎంత కాలం కొనసాగుతుందో అనే భయాందోళనలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో, మదుపరులు అయినకాడికి షేర్లను అమ్ముకోవడానికి మొగ్గుచూపారు.

దీంతో ట్రేడింగ్ మొదలైన కాసేపటికే మార్కెట్లు 10 శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్ ను తాకడంతో... ట్రేడింగ్ ను ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ ట్రేడింగ్ ను కొనసాగించినప్పటికీ... నష్టాలు ఆగలేదు. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 3,935 పాయింట్లు పతనమై 25,981కి పడిపోయింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 3950 పాయింట్ల వరకు నష్టపోయింది. నిఫ్టీ 1,135 పాయింట్లు కోల్పోయి 7,610కి దిగజారింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు తీవ్రంగా నష్టపోయాయి. గత ఏడు సెషన్లలో మార్కెట్లు లోయర్ సర్క్యూట్ ను తాకి, ట్రేడింగ్ నిలిచిపోవడం ఇది రెండోసారి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-27.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-23.67%), బజాజ్ ఫైనాన్స్ (-27.39%), ఐసీఐసీఐ బ్యాంక్ (-18.15%), మారుతి సుజుకి (-17.28%). సెన్సెక్స్ లో ఒక్క కంపెనీ షేరు కూడా లాభాల్లో ముగియలేదు.

More Telugu News