లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది: తెలంగాణ సీఎస్ సోమేశ్‌ కుమార్

23-03-2020 Mon 12:41
  • ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలన్నింటినీ మూసి వేశాం
  • గ్రామాల్లోని ప్రజలకు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు అనుమతి 
  • ప్రజలందరూ లాక్‌డౌన్‌కు మద్దతు ఇవ్వాలి
  • ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం
lockdown in telangana

ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలన్నింటినీ మూసి వేశామని, రాష్ట్రంలో పరీక్షలన్నీ వాయిదా వేశామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. లాక్‌డౌన్‌పై ఆయన ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు.

మిగతా ప్రాంతాల్లో ఐదుగురి కన్నా ఎక్కువ మంది గూమిగూడేందుకు అనుమతి లేదని సోమేశ్ కుమార్ అన్నారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను కూడా అనుమతించట్లేదని అన్నారు.

ఆటోలను పూర్తిగా బంద్‌ చేస్తున్నామని సోమేశ్‌ కుమార్ తెలిపారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు రావడానికి వీల్లేదని అన్నారు. అలాగే, ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్లలోంచి బయటకు రావాలని కోరారు.