కరోనా కట్టడికి ఏపీ సర్కారు చర్యలు అభినందనీయం: బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

23-03-2020 Mon 12:25
  • పేదలకు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయాలని సీఎం జగన్‌కు లేఖ
  • వలంటీర్ల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలని సూచన
  • మద్యం షాపులు మూసివేయాలని వినతి
AP sarkara doing the best on corona says kanna lakshminarayana

ఏపీ సర్కార్‌పై ఎప్పుడూ విరుచుకుపడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తొలిసారి ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. అదే సమయంలో నిరుపేదలు, రోజుకూలీలు ఇబ్బంది పడకుండా వారికి రేషన్‌, ఇతర సరుకుల ఉచిత పంపిణీని వెంటనే చేపట్టాలని కోరారు.

ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కరోనా వ్యాప్తిలో కీలకపాత్ర పోషిస్తున్న మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను తక్షణం మూసివేయాలని కోరారు. కరోనాపై సర్వేకు వలంటీర్ల సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం.. వైరస్‌ అధికంగా ఉండే వృద్ధుల నుంచి వారికి ఎదురయ్యే ప్రమాదాన్ని గమనించాలని కోరారు. వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి శానిటైజర్లు, మాస్క్‌లు, గ్లౌజులు అందించాలని సూచించారు.