Telangana: తెలంగాణలో లాక్ డౌన్ నుంచి మినహాయింపు వీటికే..!

  • పలు రకాల విభాగాలకు మినహాయింపు
  • నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు
  • కొందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం
Telangana Lockdown Exemption

ఈ నెల 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, కొన్ని విభాగాలకు మాత్రం మినహాయింపులు ఇచ్చింది. నిబంధనలు, మినహాయింపులతో కూడిన మొత్తం 22 అంశాలను పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, బ్యాంకులు, ఏటీఎంలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, టెలికం, తపాలా, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫార్మా, రవాణా, తయారీ రంగాలకు, ఆప్టికల్ దుకాణాలు, అంతర్జాల సేవల విభాగాలకు మినహాయింపు ఇచ్చింది.

వీటితో పాటు నిత్యావసర వస్తువుల దుకాణాలు (సరుకులు, పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు తదితరాలు), రెస్టారెంట్లలో టేక్ అవే, హోమ్ డెలివరీ, ఎల్పీజీ గ్యాస్ కంపెనీలు, పెట్రోల్ బంకులు, వీటి సంబంధిత రవాణా, అన్ని రకాల సెక్యూరిటీ సేవలు, కరోనా నియంత్రణకు సహకరించే ప్రైవేటు కంపెనీలు, ఎయిర్ పోర్టులకు లాక్ డౌన్ వర్తించదని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో భాగంగా కలెక్టరేట్లు, డివిజన్, మండల స్థాయి కార్యాలయాలు, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలు, శానిటేషన్, అగ్నిమాపక, రవాణా కార్యాలయాలు, పశు సంవర్థక శాఖ, మత్స్య, మార్కెటింగ్, కాలుష్య నియంత్రణ మండలి, తూనికలు, కొలతల శాఖ, ఔషధ నియంత్రణ సంస్థలకు, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, విద్యుత్ విభాగాలకు కూడా మినహాయింపును ఇచ్చింది. ఇక ఈ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రానవసరం లేదని, ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యం ఉన్నవారు ఇంట్లోనే విధులు నిర్వర్తించ వచ్చని పేర్కొంది. 

More Telugu News