Stock Market: స్టాక్ మార్కెట్ నేలచూపులు... 2,600 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ మొదలు!

  • పలు దేశాల్లో లాక్ డౌన్ తో వృద్ధి తగ్గే ప్రమాదం
  • 8 శాతానికి మించి పడిపోయిన సెన్సెక్స్
  • నిఫ్టీ-50లో అన్ని కంపెనీలూ నష్టాల్లోనే
Sensex extends losses over Corona

కరోనా వైరస్ భయాలు స్టాక్ మార్కెట్ ను ఇంకా వీడలేదు. పలు దేశాల్లో ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వృద్ధి ప్రభావితం అవుతుందంటూ వచ్చిన విశ్లేషణలు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయి. ఇదే సమయంలో శుక్రవారం నాటి యూఎస్ మార్కెట్ సరళి, నేటి ఆసియా మార్కెట్ల నష్టాలు కూడా ప్రభావం చూపడంతో, ఆరంభంలోనే భారత స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది.

సెషన్ ఆరంభమైన క్షణాల వ్యవధిలో 2,600 పాయింట్లకు పైగా నష్టపోయిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, ఈ ఉదయం 9.40 గంటల సమయంలో 2,460 పాయింట్ల నష్టంతో 8.23 శాతం పడిపోయి, 27,456 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక, 679 పాయింట్ల నష్టంతో, 7.77 శాతం దిగజారి, 8,066 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ-50లోని అన్ని కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి.  బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ తదితర కంపెనీలు 10 శాతానికి మించి పతనమయ్యాయి.

నేటి ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, నిక్కీ మాత్రమే 1.77 శాతం లాభంలో ఉంది. స్ట్రెయిట్స్ టైమ్స్ 7.30 శాతం, హాంగ్ సెంగ్ 3.75 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 2.49 శాతం, కోస్పీ 4.07 శాతం, సెట్ కాంపోజిట్ 6.13 శాతం, జకార్తా కాంపోజిట్ 3.61 శాతం, షాంగై కాంపోజిట్ 1.60 శాతం నష్టపోయాయి.

More Telugu News