Chandrababu: మోదీ పిలుపు మేరకు కర్ఫ్యూ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: చంద్రబాబు

Chandrababu responds on Janata Curfew
  • జనతా కర్ఫ్యూపై చంద్రబాబు స్పందన
  • వైద్య ఆరోగ్య సిబ్బందికి అభినందనలు
  • వైద్యో నారాయణో హరిః సూక్తిని నిజం చేశారంటూ డాక్టర్లపై ప్రశంసలు
కరోనా మహమ్మారిని రూపుమాపే క్రమంలో జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి ప్రధాని మోదీ పిలుపు ఇవ్వగా, ఆదివారం నాడు ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఇళ్లకే పరిమితమై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వీడియో సందేశం వెలువరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్పందించి జనతా కర్ఫ్యూని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. కరోనాపై పోరాటంలో మున్ముందు కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆకాంక్షించారు.

"కరోనా బాధితులకు స్ఫూర్తిదాయకమైన రీతిలో సేవలు అందిస్తున్న మన వైద్యులు వైద్యో నారాయణో హరిః అనే సూక్తిని నిజం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి సేవలను అభినందిస్తూ కరతాళ ధ్వనులతో జేజేలు పలికిన అశేష ప్రజానీకాన్ని కూడా ప్రశంసిస్తున్నాను" అంటూ తెలిపారు. అంతేకాదు, కరోనా ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, తద్వారా కరోనా బారి నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
Chandrababu
Janata Curfew
Corona Virus
Andhra Pradesh
India

More Telugu News