Jagan: ఒక రేటు ఫిక్స్ చేస్తాం... అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపిస్తా: సీఎం జగన్

  • ఏపీలో లాక్ డౌన్ ప్రకటించిన సీఎం జగన్
  • ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు
  • నిత్యావసరాలు అందరికీ అందుబాటులో ఉంటాయని భరోసా
AP CM Jagan warns who will hike prices during lock down period

ఏపీలో ఈ నెల 31 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని, కరోనా ప్రభావం కారణంగా లాక్ డౌన్ విధిస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. లాక్ డౌన్ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఎవరైనా ధరలు పెంచితే కలెక్టర్లు కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని, దీన్ని వ్యాపారంగా మార్చుకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని అన్నారు.

 ఏ వస్తువు ఎంతకు అమ్మాలో కలెక్టర్లు వెల్లడిస్తారని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరఫున కూరగాయల నుంచి సరుకుల వరకు ఒక రేటు ఫిక్స్ చేస్తామని, అంతకంటే ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మినట్టు తెలిస్తే వారిని జైలుకు పంపిస్తానని జగన్ తీవ్రంగా హెచ్చరించారు. వారిపై కఠినమైన సెక్షన్లు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. దీనిపై ఒక టోల్ ఫ్రీ నంబరు ఇస్తామని, దీనికి ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నీళ్లు, కూరగాయలు, పాలు, మాంసం, విద్యుత్తు, టెలికాం, ఆహార సరఫరా, మందుల షాపులు, ఎల్పీజీ దుకాణాలు, పెట్రోల్ బంకులు ఇవన్నీ మాత్రం పూర్తిగా అందుబాటులో ఉంటాయని సీఎం వివరించారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్ణయించిన విధంగానే జరుగుతాయని చెప్పారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఎక్కడా పది మంది గుమికూడ వద్దని హితవు పలికారు. తాము కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వస్తోందని, బడ్జెట్ ఆమోదం పొందితేనే తాము ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుంటుందని వివరణ ఇచ్చారు.

వ్యవసాయదారులు, రైతుకూలీలు తప్పనిసరి పరిస్థితుల్లో పొలం వెళ్లినప్పుడు అక్కడ ఇతరులకు ఎడం పాటించాలని, వారు తమ కార్యక్రమాలు వాయిదావేసుకుంటే స్వాగతిస్తామని చెప్పారు. ఈ వైరస్ మహమ్మారి కుర్రాళ్లకు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు కానీ వారు వాహకాలుగా వ్యవహరించి ఇతరులకు సోకేందుకు కారణమవుతారని జగన్ తెలిపారు. పెద్ద వయసు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని, బీపీ, షుగర్, లివర్ జబ్బులు ఉన్నవాళ్లకు దీని నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుందని, దయచేసి ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

పేదలు ఈ పరిస్థితితో ఇబ్బంది పడకూడదని భావిస్తున్నానని, ఈ నెల 29నే వీరందరికీ రేషన్ అందిస్తామని తెలిపారు. రేషన్ తో పాటు కేజీ చొప్పున కందిపప్పు కూడా ఫ్రీగా అందిస్తామని, ప్రతి కుటుంబానికి రూ.1000 ఏప్రిల్ 4వ తేదీన ప్రతి ఇంటికీ వచ్చి వలంటీర్ అందిస్తారని వెల్లడించారు. అందుకోసం రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

More Telugu News