Jagan: కరోనా నివారణ చర్యల్లో ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిచాం: సీఎం జగన్

  • ఏపీలో 6 కరోనా కేసులున్నాయని వెల్లడి
  • ఒకరు డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వెళ్లారన్న సీఎం
  • కరోనా నివారణ చర్యల్లో ముందు నిలిచామంటూ వ్యాఖ్యలు
CM Jagan press meet over corona prevention

ఇతర రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా ఏపీలో తక్కువగా ఉందంటే అది అందరి కృషి ఫలితమేనని సీఎం జగన్ అన్నారు. కరోనా ప్రభావంపై ఆయన మీడియా సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల సిబ్బంది, అధికారులను, వలంటీర్ల వ్యవస్థను అభినందిస్తున్నానని తెలిపారు. ఏపీలో 6 కరోనా కేసులు ఉంటే వారిలో ఒకరు డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వెళ్లిపోయారని వెల్లడించారు. ముఖ్యంగా, వలంటీర్లు ఇంటింటికీ తిరిగి కరోనా బాధితులున్నారేమోనని వివరాలు సేకరించి, యాప్ ద్వారా వైద్య విభాగంతో పంచుకున్నారని, ఆ సమన్వయం ఫలితంగా కరోనా నివారణ చర్యల్లో ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిచామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన 11,670 మందికి స్క్రీనింగ్ నిర్వహించామని చెప్పారు.

అయితే మున్ముందు కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు చాలానే ఉన్నాయని తెలిపారు. ఒకరితో ఒకరు కలవడం తగ్గించడం వల్లే కరోనా వ్యాప్తి తగ్గిపోతుందని వివరించారు. అదృష్టవశాత్తు ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్ కాదని, దీని పరిధి మూడు అడుగులు మాత్రమేనని వెల్లడించారు. ఈ కనీస జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండగలిగితే దీన్ని పారద్రోలవచ్చని సూచించారు. కరోనా ఉందని అనుమానం వస్తే 104 నంబరుకు కాల్ చేయాలని తెలిపారు.

More Telugu News