KCR: ప్రధాని 14 గంటలే అన్నారు, మనం 24 గంటలు పాటిద్దాం: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు

  • తెలంగాణలో 21 కేసులు నమోదైనట్టు వెల్లడి
  • 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్న సీఎం కేసీఆర్
  • 78 ప్రత్యేక బృందాలను మోహరించామని వివరణ
  • విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి
CM KCR calls for Janata Curfew

తెలంగాణలో కరోనాపై సమర సన్నద్ధతను సీఎం కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో 21 కరోనా కేసులు నమోదయ్యాయని, వారందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా అనుమానితులపై నిఘా కోసం తెలంగాణ చుట్టూ 52 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. 78 సంయుక్త కార్యాచరణ బృందాలను కూడా మోహరించామని, ముఖ్యంగా ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటివరకు 11 వేల మంది అనుమానితులను గుర్తించి వారిని పరిశీలిస్తున్నామని, అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి వివరాలు సరిగా తెలియడంలేదని అన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారికి చేతులెత్తి దండం పెడుతున్నానని, దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా సమాజం మొత్తం వ్యాధిగ్రస్తమయ్యే ప్రమాదం వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో స్వయంనియంత్రణ అవసరమని స్పష్టం చేశారు. అలా ముందుకు వచ్చినవారికోసం అంబులెన్స్ నుంచి మాత్రల వరకు ప్రభుత్వమే అన్నీ భరిస్తుందని హామీ ఇచ్చారు.

పరిస్థితి తీవ్రత కారణంగా తాము మీడియా సమావేశంలో విలేకరులను కూడా మూడు మీటర్ల ఎడంతో కూర్చోబెట్టామని, అందరి క్షేమం దృష్ట్యా ఇలాంటి చర్యలు తప్పడంలేదని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారని, ఆయన 14 గంటలు పాటిద్దాం అని చెప్పారని, కానీ తెలంగాణ వాసులు రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించి సామాజిక బాధ్యతను చాటాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

More Telugu News