ప్రేమ పేరుతో వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

21-03-2020 Sat 09:38
  • మెదక్ జిల్లా నర్సాపూర్‌ మండలంలో ఘటన
  • ప్రేమించకుంటే చంపేస్తానని బెదిరింపులు
  • కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న బాలిక
Inter girl suicide over love harassment in Medak
ప్రేమ వేధింపులకు మరో ఇంటర్ విద్యార్థిని బలైంది. బంధువైన యువకుడే వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయిన బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆమె బంధువైన యువకుడు (20) ప్రేమ పేరుతో వేధించసాగాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడు.

గురువారం రాత్రి బాలికను మరోమారు బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని బాలిక తన తల్లి దండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే, రేపు పిలిపించి మాట్లాడదామని కుమార్తెకు నచ్చజెప్పారు. నిన్న ఉదయం బాలిక తండ్రి గొర్రెలు మేపేందుకు వెళ్లగా, తల్లి పనిపై బయటకు వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అప్పుడే వచ్చిన తల్లి ఇంట్లో నుంచి పొగలు వస్తుండడాన్ని చూసి గట్టిగా కేకలు వేసింది. అప్రమత్తమైన స్థానికులు వచ్చి చూడగా, అప్పటికే బాలిక ప్రాణాలు విడిచింది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.