America: వైట్ హౌస్‌లో తొలి కరోనా కేసు నమోదు.. ట్రంప్ సర్కారు అప్రమత్తం

  • ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలోని వ్యక్తికి కరోనా
  • అమెరికాలో 230కి చేరిన మృతుల సంఖ్య
  • 18 వేలు దాటిన బాధితుల సంఖ్య
US Vice Presidents Office Staffer Tests Positive For Virus

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బృందంలోని ఓ వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం అతడు ఎవరెవరిని కలిసి ఉంటాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే, అతడు అధ్యక్షుడు ట్రంప్‌తో కానీ, ఉపాధ్యక్షుడితో కానీ నేరుగా కలవలేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ఈ మధ్యకాలంలో అతడు కలిసిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ట్రంప్ కలిసిన పలువురు వ్యక్తులు కరోనా బారిన పడడంతో ఆయన కూడా గతవారం పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకలేదని తేలింది.

ఇక, అమెరికాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి 230 మంది ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్‌లో అత్యధికంగా 74 మంది మృతి చెందారు. గత రెండు రోజుల్లో ఏకంగా పదివేల కొత్త కేసులు అమెరికాలో నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18వేలు దాటిపోయింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అత్యవసర స్థితి ప్రకటించి ఆర్మీని రంగంలోకి దింపింది.

More Telugu News