Vijayashanti: ‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్షతో యావత్​ సమాజం సంతోషపడింది: విజయశాంతి

Vijayasanthi responds on NIrbhaya convicts hanging
  • ఆడ పిల్లలున్న ప్రతి కుటుంబానికీ ఈ చట్టం అభయమిచ్చినట్టయింది
  • మరొకడు ‘మైనర్’ పేరుతో విడుదల కావడం బాధాకరం
  • ఆ మృగాడికి ఏదో ఒక రూపంలో తగిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నా
నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు చేసినందుకు యావత్ సమాజం సంతోషపడిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి అన్నారు. దోషులకు ఈ శిక్ష విధించడం ద్వారా కేవలం ఆమె కుటుంబానికే కాదు ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికి ‘నిర్భయ’ చట్టం అభయమిచ్చినట్టయిందంటూ ఓ సుదీర్ఘ పోస్ట్ లో ఆమె అభిప్రాయపడ్డారు.

‘ఎట్టకేలకు నిర్భయ ఘటన దోషులకు మరణశిక్షపడింది. ఈ పరిణామం కేవలం నిర్భయ కుటుంబానికి మాత్రమే కాదు, ఆడ పిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికీ చట్టం అభయం ఇచ్చినట్టయ్యింది. దోషులకు ఉరి అమలు చేసినందుకు యావత్ సమాజం సంతోషపడింది. కానీ ఇంతటి హేయమైన క్రూరత్వానికి పాల్పడిన అసలు నేరస్తుడు మరొకడు మైనర్ పేరుతో విడుదల కావడం బాధాకరం. ఆ మృగాడికి (మృగాలకు క్షమాపణతో...) ఏదో ఒక రూపంలో తగిన శిక్ష పడుతుందని విశ్వసిస్తున్నాను. నిజానికి ఇది సరిపోతుందా?

ఈ సందర్భంగా మనం హైదరాబాదులో కలకలం రేపిన ‘దిశ’ కేసు పరిణామాలను కూడా గుర్తు చేసుకోవాలి. నిర్భయ విషయంలో గానీ, ‘దిశ’ ఘటనలో గానీ ఆ దారుణాలు జరిగినప్పుడు యావత్ సమాజం ఆందోళనలకు దిగి దోషులకు వెంటనే శిక్ష పడాలని, ఎన్‌కౌంటర్ చెయ్యాలని భారీ ఎత్తున నిరసనలకు దిగింది. అయితే, న్యాయ ప్రక్రియ ఏళ్ళ తరబడి జాప్యం జరుగుతున్న కొద్దీ కొన్ని వర్గాలు రకరకాల కారణాలు పేర్కొంటూ బాధితులను వదిలేసి దోషుల పక్షం చేరుతున్నాయి. ‘ఈ దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? వాళ్ళను క్షమించి వదిలేయాలి‘ అనే వాదనలు లేవదీస్తున్నారు. మేధావులుగా చెప్పుకునే అలాంటివారి ఆ వాదన ప్రకారం హత్యాచార దోషులకు శిక్షలే వేయకుండా క్షమిస్తే ఈ దేశంలో ఆడపిల్లను మ్యూజియంలో చూడాల్సిందే.

ఆ వాదన ప్రకారం రేపిస్టులను మాత్రమే ఎందుకు క్షమించాలి? దొంగతనాలు, మోసాలు, దాడులకు పాల్పడినవారికి కూడా శిక్షలు పడుతున్నాయి. మరి ఈ నేరాలు మాత్రం ఆగాయా? వీళ్ళను మాత్రం క్షమించ వద్దా? ఇలా నేరాలు ఆగడం లేదు కదా అని శిక్షలే వెయ్యకుండా ఉంటే ఎలా ఉంటుంది? పోలీస్ స్టేషన్లు, కోర్టులను మూసేద్దామా? సమాజాన్ని ఎలా తయారు చెయ్యాలనుకుంటున్నారో ఆ మేధావులే చెప్పాలి?..‘ అని తన సుదీర్ఘ పోస్ట్ లో విజయశాంతి పేర్కొన్నారు.
Vijayashanti
Tollywood
Artist
Congress
Nirbhaya
convitcts
Hanging

More Telugu News