Sachin Tendulkar: కరోనాపై పోరాటాన్ని టెస్ట్ క్రికెట్ తో పోలుస్తూ.. కీలక సూచనలను ఇచ్చిన సచిన్

  • టెస్ట్ మ్యాచుల్లో సహనం, టీమ్ వర్క్, డిఫెన్స్ చాలా ముఖ్యం
  • ప్రపంచ దేశాలన్నీ ఒక టీమ్ గా కరోనాను ఎదుర్కోవాలి
  • సెషన్ల వారీగా ఎదుర్కొంటూ.. చివరకు విజయం సాధించాలి
Sachin Tendulkar compares corona battleto Test cricket

ప్రపంచ మహమ్మారి కరోనాపై పోరాటం టెస్ట్ క్రికెట్ వంటిదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో సహనం, టీమ్ వర్క్ ఉండాలని... డిఫెన్స్ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికకు రాసిన కాలమ్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మనకు అర్థంకాని, అంతుచిక్కని దాన్ని గౌరవించడమనేది టెస్ట్ క్రికెట్లో ఒక ప్రధాన అంశమని సచిన్ చెప్పారు. ముఖ్యంగా సహనం అనేది టెస్ట్ క్రికెట్లో కీలకమని తెలిపాడు. పిచ్ పరిస్థితులు కానీ, బౌలర్ విసిరే బంతులు కానీ మనం అర్థం కానప్పుడు... డిఫెన్స్ అనేదే బెస్ట్ అటాక్ అని చెప్పారు. మనం ఎంత డిఫెన్స్ ఆడితే... ఆటపై అంత పట్టును సాధించవచ్చని తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో... ప్రస్తుతం మనకు అదే సహనం అవసరమని సూచించాడు. కరోనాను కూడా మనం టెస్ట్ మ్యాచుల్లో మాదిరే డిఫెన్స్ తో ఎదుర్కొందామని చెప్పారు. కరోనాను అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు.

పొట్టి క్రికెట్ కు ఆటగాడి వ్యక్తిగత నైపుణ్యం ప్లస్ పాయింట్ అని... అదే టెస్టుల విషయానికొస్తే పార్ట్ నర్ షిప్, టీమ్ వర్క్ చాలా ముఖ్యమని సచిన్ తెలిపారు. ప్రస్తుతం వివిధ దేశాలు వివిధ స్థాయుల్లో కరోనాపై పోరాడుతున్నాయని... అన్ని దేశాలు వారిని ఒక టీమ్ లో భాగంగా భావించుకోవాలని అన్నారు. కరోనాపై పోరాటాన్ని టెస్టు మ్యాచుల్లో మాదిరి సెషన్ల వారీగా ఎదుర్కోవాలని... చివరకు విజేతలుగా నిలవాలని చెప్పారు.

More Telugu News