Pakistan: పాకిస్థాన్ ను వణికిస్తున్న కరోనా.. పాక్ డాక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్న చైనా డాక్టర్లు!

  • పాక్ లో 453కు పెరిగిన కరోనా కేసులు
  • బలూచిస్థాన్, పంజాబ్ లలో భారీగా పెరుగుతున్న కేసులు
  • కరాచీలో చర్చిల మూసివేత
Pakistan doctors been trained by China doctors for corona treatment

ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు కరోనా రూపంలో పెను ముప్పు వచ్చింది. ఆ దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు పాక్ లో 453 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

 పాక్ లోని బలూచిస్థాన్ లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజు అక్కడి కేసులు 23 నుంచి 81కి పెరిగాయి. పంజాబ్ రెండో స్థానంలో ఉంది. పంజాబ్ లో నిన్న ఒక్క రోజు కేసుల సంఖ్య 33 నుంచి 78 కి పెరిగింది. సింధ్ ప్రావిన్స్ లో ఇప్పటి వరకు 245 కేసులు నమోదయ్యాయి. ఖైబర్ ఫక్తూంఖ్వా లో 23, ఇస్లామాబాద్ లో 2, పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్ లలో 24 మందికి కరోనా సోకింది. ఈ వివరాలను అక్కడి ప్రముఖ మీడియా సంస్థ 'డాన్' వెల్లడించింది.

ఈ సందర్భంగా పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ మీడియాతో మాట్లాడుతూ, కరోనాను ఎదుర్కొనే క్రమంలో సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఆర్మీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఎమర్జెన్సీ కేసుల కోసం ఆర్మీ మెడికల్ ఫెసిలిటీస్ ను వాడుకోవచ్చని తెలిపారు.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైద్య సలహాదారుడు డాక్టర్ జాఫర్ మీర్జా మీడియాతో మాట్లాడుతూ, కరోనా విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాకిస్థాన్ డాక్టర్లకు చైనా డాక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లేవారికి ఇచ్చే ట్రైనింగ్ నిలిపివేసినట్టు మత వ్యవహారాల శాఖ మంత్రి నూర్ ఉల్ ఖాద్రి చెప్పారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచీపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి చర్చిలను మూసివేస్తున్నట్టు క్రిస్టియన్ ప్రముఖులు ప్రకటించారు.

More Telugu News