Facebook: కరోనా నేపథ్యంలో... ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్ గా ఇచ్చిన ఫేస్ బుక్!

  • ఫుల్ టైమ్ ఉద్యోగులకు బోనస్
  • వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అదనంగా 1000 డాలర్లు
  • వెల్లడించిన ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్
Six Months Bonus for Facebook Employees

తమ సంస్థలో పని చేస్తున్న 45 వేల మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు ఆరు నెలల వేతనాన్ని బోనస్ గా అందిస్తున్నామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో, తమను, తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఈ డబ్బులు కేటాయించుకోవాలని, వర్క్ ఫ్రమ్ హౌమ్ చేసే సదుపాయం కల్పించిన వారికి అదనంగా మరో 1000 డాలర్లు ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. ఈ 1000 డాలర్లతో ఇంటి నుంచి పని చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్ సదుపాయం ఉండదని తెలిపారు.

ఇదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్న ఫేస్ బుక్ కార్యాలయాల్లో లాక్ డౌన్ ప్రకటించినా, వారు విధులకు రాకపోయినా పూర్తి వేతనం ఇస్తామని జుకర్ బర్గ్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకునేందుకు ఉద్యోగులకు సమయం అవసరమని, ఆ విషయం తమకు తెలుసునని అన్నారు. ఈ మేరకు అధికారిక మెమోను జారీ చేసిన ఆయన, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియను ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే అదనపు వ్యయాన్ని సంస్థ భరిస్తుందన్నారు.

కాగా, ఫేస్ బుక్ లో ఉద్యోగి సగటు వార్షిక వేతనం 2018లో 2.28 లక్షల డాలర్లుగా ఉంది. ఇప్పటికే సియాటెల్ లోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని కొవిడ్-19 భయంతో తాత్కాలికంగా మూసివేశారు. మిగతా కార్యాలయాల్లో చాలా వరకూ మూతబడ్డాయి. గత వారం రోజులుగా అత్యధిక ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు.

More Telugu News