Chandrababu: సిగ్గు, శరం లేకుండా ఎదురుదాడి చేస్తారా?: చంద్రబాబు

  • రాష్ట్రంలో జరిగిన అరాచకాలపై ఎస్ఈసీ లేఖ రాశారన్న చంద్రబాబు
  • అభ్యర్థి ఇంట్లో మద్యం సీసాల అంశం కూడా ఉందని వెల్లడి
  • పరిస్థితి తీవ్రతకు లేఖ అద్దం పడుతోందని వ్యాఖ్యలు
Chandrababu responds on SEC letter to Union Government

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్రానికి రాసినట్టుగా భావిస్తున్న లేఖ దుమారం రేపుతోంది. ఈ లేఖ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెచ్చిన వైనాన్ని, తెనాలిలో వైసీపీ గూండాలు టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఇంట్లో అక్రమంగా మద్యంగా సీసాలు పెట్టడాన్ని ఎస్ఈసీ తన లేఖలో ప్రస్తావించారని చంద్రబాబు వివరించారు. తాము సైతం ఇవే అంశాలను ఆరోపించామని, వైసీపీ అరాచకాలకు వీడియో ఫుటేజ్ సాక్ష్యం కూడా ఉందని తెలిపారు.

వాళ్లే మందు సీసాలు పెట్టి, వాళ్లే పోలీసులను పంపించారని, ఎక్కడ దాచారో అక్కడికే నేరుగా ఆ పోలీసులు వెళ్లి మందు సీసాలు తీశారని ఆరోపించారు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి ఉందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే దీనిపై మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఎదురుదాడి చేస్తారా? అంటూ నిలదీశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగానే స్థానిక ఎన్నికలు వాయిదావేశారని, కానీ ఆయన భద్రతకే ముప్పు ఉందన్న విషయం ఇప్పుడు వెల్లడవుతోందని అన్నారు. తనకు భద్రత ఉంటే తప్ప విధి నిర్వహణ చేయలేనని ఎస్ఈసీ చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని పేర్కొన్నారు.

More Telugu News