Alla Nani: ఏపీలో ‘కరోనా’ కట్టడికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోంది: మంత్రి ఆళ్ల నాని

  • పరిస్థితులను అంచనా వేస్తూ సీఎం ఆదేశాల మేరకు చర్యలు
  • ‘కరోనా’ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 
  • ఈ నెల 31 వరకు సినిమా హాల్స్ , మాల్స్ మూసివేత
AP Minister Alla Nani press meet

‘కరోనా’ కట్టడికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిస్థితులను అంచనా వేస్తూ సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నామని, ముందస్తు చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం తప్పనిసరని అన్నారు. రాష్ట్రంలో  ‘కరోనా’ పాజిటివ్ కేసులు కేవలం రెండు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే పలు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు.
 
‘కరోనా’ దృష్ట్యా ఏపీలో ఈ నెల 31 వరకు సినిమాహాల్స్, మాల్స్ మూసివేస్తున్నామని, పెద్ద ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లే భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వ్యాపార సంస్థలు రక్షణ చర్యలు పాటించాలని, పరిశుభ్రత పాటించేలా శానిటైజర్స్ ఏర్పాటు చేయాలని, ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెళ్లిళ్లు వాయిదా వేసుకునేలా చూడాలని, ఒకవేళ పెళ్లిళ్లు జరుపుకుంటే తమ కుటుంబసభ్యులు మాత్రమే వచ్చేలా చూడాలని సూచించారు.

More Telugu News