Sensex: పేకమేడలా... మరో బ్లాక్ థర్స్ డే... 2 వేల పాయింట్లు పతనమైన సెన్సెక్స్!

  • ప్రస్తుతం 1650 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
  • కీలకమైన 8 వేల స్థాయిని కోల్పోయిన నిఫ్టీ
  • అన్ని ప్రధాన కంపెనీలూ నష్టాల్లోనే
BSE Loss Widens

కరోనా భయం ప్రపంచాన్ని మరో ఆర్థిక మాంద్యంలోకి తోసేయనుందన్న అంచనాల నేపథ్యంలో, ఈ ఉదయం స్టాక్ మార్కెట్ పేకమేడలా కూలింది. మరో బ్లాక్ థర్స్ డేను నమోదు చేస్తూ, సెషన్ ఆరంభంలోనే సెన్సెక్స్ 2 వేల పాయింట్లు పడిపోయింది. ఆపై స్వల్పంగా తేరుకుంది.

ఈ ఉదయం 10.40 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 1650 పాయింట్లు పడిపోయి 27,218 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 500 పాయింట్ల పతనం స్థాయి నుంచి కాస్తంత తేరుకుని ప్రస్తుతం 484 పాయింట్ల నష్టంతో 7,984 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అత్యంత కీలకమైన 8 వేల పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీకి మద్దతు లభించకపోవడంతో, ఆరు వేల పాయింట్ల వరకూ నిఫ్టీ పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక గురువారం నాడు సెన్సెక్స్ లోని అన్ని ప్రధాన కంపెనీలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. నేడు ఇన్వెస్టర్ల సంపద దాదాపు 7 లక్షల కోట్లకు పైగా హారతి కర్పూరమైంది.

భారత మార్కెట్లు ప్రస్తుతం 5.5 శాతానికి పైగా నష్టంలో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లదీ అదే పరిస్థితి. ఆసియా మార్కెట్లలో నిక్కీ 1.59 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 4.44 శాతం, హాంగ్ సెంగ్ 4.32 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 5.73 శాతం, కోస్పీ 7.76 శాతం, సెట్ కాంపోజిట్ 3.20 శాతం, జకార్తా కాంపోజిట్ 5.35 శాతం, షాంగై కాంపోజిట్ 2.14 శాతం నష్టపోయాయి.

More Telugu News