self isolate: స్వదేశంలో స్వీయ నిర్బంధంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు

  • మంగళవారం కోల్‌కతా నుంచి స్వదేశం వెళ్లిన సఫారీ టీమ్‌ 
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులు సెల్ఫ్–క్వారెంటైన్
  • వైరస్‌ లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆదేశం
South African cricketers told to self isolate on return from india

భారత పర్యటన అర్థాంతరంగా ముగియడంతో స్వదేశానికి తిరిగివెళ్లిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. భారత్, సఫారీ టీమ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఆ వెంటనే దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువ కావడంతో మిగతా రెండు మ్యాచ్లను బీసీసీఐ రద్దు చేసింది. దేశంలో ఒక్క కరోనా కేసులేని కోల్‌కతా నుంచి మంగళవారం ఉదయం సఫారీలు స్వదేశానికి బయల్దేరారు.

విదేశాల నుంచి వచ్చిన ఇతర ప్రయాణికుల మాదిరిగానే దక్షిణాఫ్రికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉండాలని క్రికెటర్లకు అధికారులు సూచించారు. దాంతో, ఆటగాళ్లంతా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌ చీఫ్ మెడికల్ ఆఫీసర్ షుయిబ్ మంజ్రా తెలిపారు. క్రికెటర్లు తమను తాము రక్షించుకోవడంతో  పాటు కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అన్నారు.

భారత్‌ నుంచి తిరిగొచ్చిన ఆటగాళ్లలో ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని మంజ్రా చెప్పారు. ప్రయాణ సమయంలో కొంత మంది ఆటగాళ్లు మాస్కులు ధరించారని, మరికొందరు సాధారణంగా ఉన్నారని తెలిపారు. అలాగే, ఇతరులను ఎవ్వరికీ దగ్గరకి రానివ్వలేదని, ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకున్నామని మంజ్రా తెలిపారు. కోవిడ్ లక్షణాల గురించి క్రికెటర్లకు తగిన సమాచారం అందజేశామన్నారు.

More Telugu News