BMW car: మూత్ర విసర్జన కోసం కిందకు దిగితే.. బీఎండబ్ల్యూ కారును ఎత్తుకెళ్లిన దుండగులు!

  • నోయిడాలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘటన
  • తుపాకీతో బెదిరించి కారును ఎత్తుకెళ్లిన దుండగులు
  • తెలిసిన వ్యక్తులే ఈ పని చేసుండొచ్చని పోలీసుల అనుమానం
Man pulls up BMW to urinate loses car as thieves flee with it

నోయిడాలోని ఓ వ్యక్తికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. మార్గమధ్యంలో మూత్ర విసర్జన కోసం రిషభ్ అరోరా అనే స్టాక్ బ్రోకర్ కారు నుంచి కిందకు దిగాడు. ఈలోగా ఆయన బీఎండబ్ల్యూ కారును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. నోయిడా సెక్టార్ 90లోని ఫేజ్-2 పోటీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పార్టీకి వెళ్లి తిరిగొస్తుండగా శనివారం రాత్రి ఇది జరిగింది. దీనిపై పోలీసులకు అరోరా ఫిర్యాదు చేశాడు.

తాను కారు ఆపిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్ పై వచ్చారని తన ఫిర్యాదులో అరోరా తెలిపారు. తుపాకీతో తనను బెదిరించి కారును తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, అరోరా పేర్కొన్న విషయాలను కూడా నిర్ధారించుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన అతిగా మద్యం సేవించి ఉన్నాడు.

ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ, దొంగలు ఎత్తుకెళ్లిన కారు అరోరా బావమరిదికి చెందినదని... దానిపై ఇంకా రూ. 40 లక్షల లోన్ పెండింగ్ లో ఉందని చెప్పారు. కారు యజమానికి తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉండొచ్చని తెలిపారు. త్వరలోనే కారు ఎక్కడుందో కనుగొంటామని చెప్పారు.

అరోరాపై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారా? అనే ప్రశ్నకు బదులుగా... తొలుత కారును గుర్తించి, దొంగలను పట్టుకోవడమే తమ లక్ష్యమని డీసీపీ హరీశ్ చందర్ చెప్పారు. నగరంలో ఈ విధంగా కారును దొంగిలించడమేది తీవ్ర నేరంగానే భావించాల్సి ఉంటుందని అన్నారు.

More Telugu News