telangana assembly: నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు... నేనెక్కడి నుంచి తేవాలి?: అసెంబ్లీలో కేసీఆర్

  • ఎప్పుడో పుట్టిన వారికి ఇప్పుడు సర్టిఫికెట్ ఎవరిస్తారు 
  • సీఏఏపై చర్చ సందర్భంగా సీఎం సుదీర్ఘ ప్రసంగం 
  • ఇది హిందూ, ముస్లింల సమస్య కాదు
I have No birth certificate says CM KCR

ఐదువందల ఎకరాల భూస్వాముల కుటుంబంలో పుట్టిన తనకే బర్త్ సర్టిఫికెట్ లేదని, ఇక ఎప్పుడో పుట్టిన సామాన్యులు ఇప్పుడు సర్టిఫికెట్ తెమ్మంటే ఎక్కడ నుంచి తెస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. 

ఈ రోజు అసెంబ్లీలో సీఏఏపై చర్చ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం, జనాభా రిజిస్టర్ తదితరాలను కేవలం హిందూ, ముస్లింల అంశంగా చూడవద్దన్నారు. ఇవి అమల్లోకి వస్తే ఎదురయ్యే పరిణామాల తీవ్రతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు.

'నేను చింతమడకలోని మా ఇంట్లో పుట్టాను. అప్పట్లో మా పెద్దోళ్లు ఊళ్లో ఉండే పెద్దమనుషులను పిలిపించి వారి సమక్షంలో నా జన్మపత్రిక రాయించారు. అంతేతప్ప ఎటువంటి సర్టిఫికెట్ లేదు' అని వివరించారు. ఈ పరిస్థితుల్లో దళితులు, గిరిజనులు, కూలీనాలీ చేసుకునే జనం, ఓసీల్లో పేదల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలని కోరారు.

సీఏఏ వంటి చట్టాల వల్ల దేశ ప్రతిష్ఠ మంటగలుస్తోందన్నారు. కొన్ని కోట్ల మందికి సర్టిఫికెట్లు లేవని, ఈ పరిస్థితుల్లో దేశంలో విభజన రాజకీయాలు మంచిది కాదన్నారు. టీఆర్ఎస్ లౌకిక పునాదులపై ఏర్పడిందని, దానికే కట్టుబడి ఉంటుందన్నారు. అసహన వైఖరి, భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరైన విధానం కాదని కేసీఆర్ అన్నారు.

More Telugu News