Corona Virus: కరోనా మిగిల్చిన గుండెకోత.. తండ్రి అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారా చూసిన తనయుడు!

  • గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తండ్రి 
  • చూసేందుకు ఖతర్ నుంచి వచ్చిన కుమారుడు
  • కరోనా లక్షణాలతో తండ్రి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే చేరిక
kerala man watched father funeral on video call

కరోనా వైరస్ ఇప్పుడు అయినవారిని దూరం చేస్తోంది. ఎన్నో కుటుంబాల్లో చీకట్లు నింపుతున్న ఈ మహమ్మారి కేరళలోని ఓ యువకుడిని గుండెకోతకు గురిచేసింది. తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో మరణిస్తే.. కరోనా లక్షణాలతో బాధపడుతూ అదే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కుమారుడు కడసారి కన్నతండ్రిని చూసే అదృష్టానికి నోచుకోలేకపోయాడు. చివరికి వీడియో కాల్‌ ద్వారా తండ్రి అంత్యక్రియలను చూడాల్సి వచ్చింది.

తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న లినో అబెల్ (29) ఈ నెల 8న దోహా నుంచి ఉన్న పళంగా కేరళ వచ్చాడు. అయితే, ఎయిర్‌పోర్టులో జరిపిన స్క్రీనింగ్ పరీక్షల్లో అతడిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. కన్నతండ్రిని చూడాలన్న ఆరాటంతో వెంటనే కొట్టాయంలోని ఆసుపత్రికి చేరుకున్నాడు. అయితే, తాను వెళ్లి కలిస్తే కుటుంబ సభ్యులందరికీ ఈ మహమ్మారి సోకుతుందని భావించి మనసు మార్చుకున్నాడు. వెంటనే వైద్యులను కలిసి విషయం చెప్పాడు. వారు అతడిని చికిత్స కోసం ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

మరోవైపు, ఆ తర్వాతి రోజు అంటే ఈ నెల 9న పరిస్థితి విషమించడంతో యువకుడి తండ్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అబెల్ తండ్రిని కడసారి చూడాలనుకున్నాడు. అయితే, మళ్లీ కుటుంబ సభ్యులు గుర్తొచ్చారు. వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. చివరికి కిటికీ ద్వారా  తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. అది చూసి చలించిపోయిన వైద్యులు.. వీడియో కాల్ ద్వారా తండ్రి అంత్యక్రియలు చూపించారు.

More Telugu News