Sanjay Manjrekar: కామెంటేటర్ గా తనను తొలగించడం పట్ల సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు

  • నోటి దురుసుతనానికి కేరాఫ్ అడ్రస్ గా మంజ్రేకర్
  • వేటు వేసిన బీసీసీఐ
  • కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగింపు
  • ఓ ప్రొఫెషనల్ కామెంటేటర్ గా ఈ నిర్ణయాన్ని శిరసావహిస్తానన్న మంజ్రేకర్
Sanjay Manjrekar responds on his deletion from commentary panel

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ను బీసీసీఐ కామెంటేటర్ గా తొలగించిన సంగతి తెలిసిందే. సంజయ్ మంజ్రేకర్ పై వేటు వేసినట్టు ఈ ఉదయం నుంచి వార్తలు వస్తున్నా, వాటిలో అధికారిక సమాచారం ఏదీ లేదు. దీనిపై సంజయ్ మంజ్రేకర్ స్వయంగా స్పందించాడు. తనను బీసీసీఐ తొలగించిన విషయం వాస్తవమేనని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించాడు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన మంజ్రేకర్, బీసీసీఐ నిర్ణయాన్ని పక్కా ప్రొఫెషనల్ గా అంగీకరిస్తున్నానని తెలిపాడు.

"కామెంటరీ చెప్పడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అదో ఉపాధి అవకాశం అని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను కొనసాగించాలో, వద్దో అనేది నన్ను నియమించుకున్న సంస్థకు చెందిన విషయం. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను పాటిస్తాను. బీసీసీఐ  ఇక ఎంతమాత్రం నా పెర్ఫార్మెన్స్ పట్ల సంతృప్తి చెందదు అనుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశాడు.

మంజ్రేకర్ తన వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కుకోవడం ఎన్నో పర్యాయాలు జరిగింది. ముఖ్యంగా, వరల్డ్ కప్ సమయంలో రవీంద్ర జడేజాను ఉద్దేశించి 'బిట్స్ అండ్ పీసెస్' ఆటగాళ్లను నేను పెద్దగా ఇష్టపడను అంటూ వ్యాఖ్యానించాడు. జట్టులోకి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండే ఆటగాళ్లంటే తనకు నచ్చదే అనే ఉద్దేశంలో మంజ్రేకర్ ఆ వ్యాఖ్యలు చేయగా, జడేజా దీటుగా బదులిచ్చాడు. 'నీ నోటి విరేచనాలు ఇక ఆపు' అంటూ తీవ్రంగా స్పందించాడు. అటు తర్వాత కూడా మంజ్రేకర్ మారిందేమీ లేదు. మరికొందరిపైనా అదే తరహాలో వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.

More Telugu News