Hyderabad: రూ. 135 ముఖ్యమా? మీ ప్రాణాలు వద్దా?: ఫోటోలు పోస్ట్ చేసి ప్రశ్నిస్తున్న హైదరాబాద్ పోలీసులు!

  • చలాన్లను తప్పించుకునేందుకు సర్కస్ ఫీట్లు
  • ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్న పోలీసులు
  • ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచే ప్రయత్నాలు
Bikers Feets to Escape Challans

వాహన నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రయాణించడంతో పాటు, పోలీసులు ఎక్కడ చలాన్లు వేస్తారోనన్న భయంతో, వాహనదారులు చేస్తున్న సర్కస్ ఫీట్లను క్యాప్చర్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులు, వాటిని పోస్ట్ చేస్తూ, ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం రూ. 135 జరిమానా పడుతుందన్న కారణంతో, బైకర్లు చేస్తున్న, చేయిస్తున్న విన్యాసాలు, వారి ప్రాణాలపైకి తెస్తున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.

ఇటీవల ఓ వ్యక్తి, హైటెక్ సిటీ సమీపంలో స్కూటీపై వెళుతూ, వెనక ఉన్న నంబర్ ప్లేట్ పోలీసులకు కనిపించకుండా చూసేందుకు తన కుమార్తె ప్రాణాలనే పణంగా పెట్టాడు. బాగా వెనక్కు జరిగి కూర్చోమని చెప్పి, పాప చేతిని నంబర్ కు అడ్డు పెట్టించాడు. దీన్ని ఫోటో తీసిన పోలీసులు, 135 రూపాయల చలాన్ ను తప్పించుకునేందుకు చిన్న బిడ్డ జీవితంతో చెలగాటమాడటం సరేనా? అంటూ ప్రశ్నించారు. ఆ పాప పడిపోతే ఏంటని సోషల్ మీడియాలో సైబరాబాద్ పోలీసులు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పై చిన్నారులకు అవగాహన కల్పించాల్సిన తల్లిదండ్రులు ఇలా చేయడం ఏంటని అధికారులు వాపోతున్న పరిస్థితి.

ఇక మరో ఘటనలో ఓ బైకర్, ఏకంగా తన కాలును నంబర్ ప్లేట్ అడ్డుగా పెట్టి ముందుకెళ్లాడు. ఈ సమయంలో కాస్తంత అదుపు తప్పితే, అతని ప్రాణాలకే అపాయం ఏర్పడుతుంది. బైకర్ కిందపడి చిన్నపాటి గాయాలైతే రూ. 2 వేల ఖర్చుతో పాటు వారం రోజులు ఆఫీసుకు సెలవు పెట్టాల్సి వస్తుందని, కాలో, చెయ్యే విరిగితే రూ. 50 వేల వరకూ బిల్లు పడుతుందని, దురదృష్టవశాత్తూ మరేదైనా జరిగితే ఇంటిల్లిపాదీ నరకాన్ని అనుభవిస్తుందని, ఇటువంటి పనులు చేసేముందు మరోసారి ఆలోచించుకోవాలని అధికారులు సలహా ఇస్తున్నారు.

More Telugu News