Chandrababu: రాష్ట్రంలో ఉగ్రవాదుల కంటే తీవ్రంగా తయారయ్యారు: చంద్రబాబు

  • తమ అభ్యర్థులపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపణ
  • ఇవన్నీ ప్రజాస్వామ్యంపై దాడులని వ్యాఖ్యలు
  • ప్రజలు ధైర్యంగా ఓటేయాలని పిలుపు
Chandrababu fires in YSRCP government

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో తమ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నడూ చూడని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేస్తుంటే అడ్డుకున్నారని, అభ్యర్థులు మారువేషాలు వేసుకుని నామినేషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగానూ అనేక ఘటనలు జరిగాయని అన్నారు. ఇవన్నీ ప్రజాసామ్యంపై జరిగిన దాడులు అని చంద్రబాబు అభివర్ణించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు.

రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది మామూలు అరాచకత్వం కాదని, అరాచకాన్ని వ్యవస్థీకృతం చేశారని విమర్శించారు. ఎక్కడన్నా ఒకటీ అరా ఘటనలు జరిగితే వాటిని అరికట్టవచ్చని, కానీ ఎక్కడన్నా ఒకరిద్దరు చట్టబద్ధంగా పనిచేయాలనుకున్నా వీలుకాని పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. టెర్రరిజం స్థాయిలో అలాంటివారిపైనా విరుచుకుపడి, వారిని కూడా లోబరుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"వీళ్లకు అధికారం ఉంది కాబట్టి ఓ పనిచేస్తే బాగుండేది. మేం నామినేట్ చేసుకుంటాం అని ప్రకటించి ఉంటే ప్రజలకు ఈ బాధలు తప్పేవి. ఉగ్రవాదుల కంటే తీవ్రంగా తయారయ్యారు. రేపు ఎవరి ధన, మాన, ప్రాణాలకూ రక్షణ ఉండకపోవచ్చు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలకు చెప్పేది ఒక్కటే. ప్రజలు ధైర్యంగా ఓటేయాలి. టీడీపీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతోందన్న విషయం గుర్తుంచుకోవాలి" అంటూ ప్రసంగించారు.

More Telugu News