High Level Committee: ముగిసిన తెలంగాణ హైలెవల్ కమిటీ సమావేశం.... మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్?

  • తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైలెవల్ కమిటీ సమావేశం
  • ఈ సాయంత్రం సమావేశం కానున్న తెలంగాణ క్యాబినెట్
CM KCR conducts high level committee meet on corona outbreak

తెలంగాణలో కరోనా ఉద్ధృతిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన హైలెవల్ కమిటీ సమావేశం కొద్దిసేపటి కింద ముగిసింది. కరోనాపై వైద్య అధికారులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా, విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారానే కరోనా వ్యాప్తి జరుగుతున్నట్టు గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది.

 కరోనా విస్తరణను అరికట్టే క్రమంలో రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ ను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని సాయంత్రం జరిగే క్యాబినెట్ సమావేశంలో మరింత లోతుగా చర్చించి ప్రకటన చేస్తారని సమాచారం. కాగా, హైలెవల్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియాకు వెల్లడించే అవకాశాలున్నాయి.

ఇక, తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా, మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, పదో తరగతి పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

More Telugu News