Narendra Modi: ఇది చాలా ముఖ్యమైన సమాచారం.. చదవండి: ట్విట్టర్ లో ప్రధాని మోదీ

  • కరోనా వ్యక్తులను కలిస్తే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న కేంద్రం
  • వ్యాధి లక్షణాలు బయటపడేందుకు 14 రోజులు పడుతుందని వెల్లడి
  • ప్రత్యేక సూచనలతో ఓ జాబితా విడుదల చేసిన కేంద్రం
Union health ministry and PM Modi shares corona home quarantine guidelines

కరోనా వైరస్ బాధితులను ఎవరైనా కలిస్తే, వారు కొన్నిరోజుల పాటు స్వీయ గృహనిర్బంధంలో ఉండడం మేలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఎవరికైనా కరోనా సోకితే 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయని వెల్లడించింది. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఈ సూచనల జాబితాను మోదీ ట్విట్టర్ లో పంచుకున్నారు.

కరోనా బాధితులను కలిసిన వ్యక్తి ఏంచేయాలంటే....

  • స్వీయ గృహనిర్బంధంలో భాగంగా వ్యక్తులు గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే సింగిల్ రూమ్ లో ఉండాలి.
  • ఆ గదికి అటాచ్డ్ టాయిలెట్ ఉంటే మంచిది. ముఖ్యంగా, ఆ ఇంట్లో ఉన్న వృద్ధులకు గర్భవతులకు ఎడం పాటించాలి. పిల్లలు, ఇతరులతో కలివిడిగా ఉండరాదు.
  • ఇంట్లో తన కదలికలను సదరు వ్యక్తి నియంత్రించుకోవాలి. పెళ్లిళ్లకు, ఇతర కార్యక్రమాలకు హాజరుకాకపోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని చాలావరకు నియంత్రించినవారవుతారు.
  • ప్రాథమిక శుభ్రత గురించి చెప్పాల్సి వస్తే.... తరచుగా సబ్బుతో, శానిటైజర్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఆ వ్యక్తి ఇంట్లోని ఇతర వస్తువులను కడగడం, అంట్లు తోమడం, దుస్తులు ఉతకడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.
  • అన్నివేళలా మాస్కు ధరించాలి. ప్రతి 6 గంటలకు ఓ సారి మాస్కును మార్చుతుండాలి. ఓసారి వాడిన మాస్కును మరోసారి ధరించరాదు.
  • కరోనా లక్షణాలు బయటపడ్డాయని భావిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించడం కానీ, 011-23978046 నంబరుకు ఫోన్ చేయాలి.
సదరు వ్యక్తి గురించి ఇంట్లో వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే....

  • స్వీయ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని కేవలం ఒక వ్యక్తి మాత్రమే పర్యవేక్షణ చేయాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తితో కరచాలనం చేయడం, నేరుగా తాకడం చేయరాదు.
  •  ఆ వ్యక్తి గదిని శుభ్రపరచాల్సి వచ్చినప్పుడు చేతులకు గ్లోవ్స్ ధరించాలి.
  • గ్లోవ్స్ తీసేసిన తర్వాత విధిగా చేతులు శుభ్రపరుచుకోవాలి.
  • సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.
  • ఒకవేళ ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు వెల్లడైతే, ఆ వ్యక్తి సన్నిహితులకు కూడా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధం తప్పనిసరి.
  • ఆ వ్యక్తి గదిని 1 శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి.
  • టాయిలెట్లను ఫినాయిల్, బ్లీచింగ్ దావ్రణాలతో పరిశుభ్ర పరచాలి.
  • ఆ వ్యక్తి దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతకాలి.

More Telugu News