సంజయ్‌ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్‌: కామెంట్రీ ప్యానెల్‌ నుంచి తొలగింపు

14-03-2020 Sat 12:08
  • పనితీరు నచ్చకే వేటు వేసినట్లు సమాచారం
  • మిగిలిన ముగ్గురు కొనసాగింపు
  • డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌గా ఒకప్పుడు గుర్తింపు
manjrekar out from BCCI comentry panel list
కామెంట్రీ ప్యానెల్‌లో సభ్యుడైన టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాకిచ్చింది. ప్యానెల్‌ నుంచి అతని పేరును తొలగించింది. అయితే ఇందుకు కారణాలు మాత్రం పేర్కొనలేదు. అతని పనితీరు నచ్చకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో జరగాల్సిన వన్డే మ్యాచ్‌కి (ఇది రద్దయింది) ప్యానెల్‌ సభ్యులైన సునీల్‌ గవాస్కర్‌, ఎల్‌.శివరామకృష్ణన్‌, మురళీకార్తీక్‌లు హాజరైనా సంజయ్‌ మంజ్రేకర్‌ కనిపించక పోవడం ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. ‘మంజ్రేకర్‌ పనితీరుపట్ల అధికారులు సంతోషంగా లేరు. అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది అని ఓ అధికారి తెలిపారు’ అంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ఈ వ్యవహారంపై కథనం ప్రచురించడంతో విషయం వెలుగు చూసింది.