Andhra Pradesh: లోకేశ్ విమర్శలపై స్పందించిన ఏపీ డీజీపీ సవాంగ్.. ఆ ముగ్గురు గురజాల సబ్‌జైలులో ఉన్నారని వివరణ

  • రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు
  • పటిష్ఠ భద్రత మధ్య స్థానిక ఎన్నికలు
  • బోండా ఉమ, బుద్ధా వెంకన్నలకు మా వాహనాల్లోనే భద్రత కల్పించాం
AP DGP speaks about Macherla Issue

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి ముప్పు లేదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యానికి, శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ వారు ఫిర్యాదు ఇచ్చినా స్వీకరిస్తున్నట్టు తెలిపారు.

 మాచర్ల ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన ఆరోపణలపైనా సవాంగ్ స్పందించారు. మాచర్ల ఘటన తర్వాత లోకేశ్ స్పందిస్తూ.. టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేసిన వైసీపీ నాయకుడికి స్టేషన్ బెయిలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగితే ఒకసారి స్టేషన్ బెయిలు అని, మరోసారి పారిపోయాడని అంటున్నారని మండిపడ్డారు. కోర్టులు కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని లోకేశ్ పేర్కొన్నారు.  

లోకేశ్ విమర్శలపై స్పందించిన డీజీపీ.. మాచర్ల ఘటనలో ముగ్గురు నిందితులు జైల్లోనే ఉన్నారని డీజీపీ తెలిపారు. మాచర్ల ఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో తాము ఎవరికీ అనుకూలంగా వ్యవహరించబోమన్నారు. సెక్షన్‌ 307 కింద కేసులు నమోదు చేయలేదని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు గురజాల సబ్‌జైలులో ఉన్నట్టు తెలిపారు. మాచర్ల ఘటనపై తమను విమర్శించేవారు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను తమ వాహనాల్లో ఎక్కించుకుని భద్రత కల్పించిన విషయాన్ని గుర్తించాలని డీజీపీ కోరారు.

More Telugu News