Ranji Trophy: రంజీ ట్రోఫీలో నయా చాంపియన్ సౌరాష్ట్ర

  • బెంగాల్‌తో ఫైనల్ మ్యాచ్ డ్రా
  • తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ట్రోఫీ నెగ్గిన సౌరాష్ట్ర
  • రన్నరప్‌తో సరిపెట్టుకున్న బెంగాల్‌
Saurashtra are the new Ranji Trophy champions

దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్‌ ఆవిర్భవించింది. సీజన్‌ అసాంతం అద్భుతంగా ఆడిన సౌరాష్ట్ర జట్టు మెగా టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచింది. బెంగాల్‌ జట్టుతో ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌ శుక్రవారం డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా సౌరాష్ట్ర ట్రోఫీ నెగ్గగా, పదమూడేళ్ల విరామం తర్వాత ఫైనల్‌కు వచ్చిన బెంగాల్ రన్నరప్‌తో సరిపెట్టింది. జయ్‌దేవ్‌ ఉనాద్కట్‌ కెప్టెన్సీలో సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 425 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రతిగా బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకే ఆలౌటైంది.

ఓవర్‌‌నైట్‌ స్కోరు 354/6తో చివరి రోజైన శుక్రవారం ఆట కొనసాగించిన బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించేలా కనిపించింది. అయితే, తొలి సెషన్‌లోనే ఓవర్‌‌నైట్ బ్యాట్స్‌మన్‌ అనుస్తుప్‌ మజుందార్‌‌ (63)ను ఔట్‌ చేసి బెంగాల్‌కు షాకిచ్చిన ఉనాద్కట్‌.. ఇషాన్‌ పోరెట్‌ (1) వికెట్ కూడా పడగొట్టి ప్రత్యర్థిని 400ల్లోపే ఆలౌట్ చేశాడు. దాంతో, సౌరాష్ట్ర 41 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టు మ్యాచ్‌ చివరకు 4 వికెట్ల నష్టానికి 105 పరుగులతో నిలిచింది. మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా సౌరాష్ట్రను విజేతగా ప్రకటించారు.

More Telugu News